మైనారిటీలను రక్షించాల్సిందే .. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై జైశంకర్ ఆందోళన

మైనారిటీలను రక్షించాల్సిందే .. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై జైశంకర్ ఆందోళన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్  అన్నారు. మైనారిటీలను బంగ్లా ప్రభుత్వం రక్షించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం లోక్ సభలో క్వశ్చన్  అవర్ లో ఆయన మాట్లాడారు. భారత్ తో సుస్థిర సంబంధానికి ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం ముందుకు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

 అలాగే, పాకిస్తాన్ పైనా జైశంకర్  మాట్లాడారు. టెర్రరిస్టులను పూర్తిగా తుడిచిపెడితేనే పాక్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. చైనా అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. లద్దాఖ్ లోని దెప్ సాంగ్ లో అన్ని గస్తీ కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరిస్తామని వెల్లడించారు. దెప్ సాంగ్, దెమ్ చోక్  విషయంలోనే చైనాతో చివరిసారిగా బలగాల ఉపసంహరణ ఒప్పందం జరిగిందన్నారు.  

కెనడాలో భారత విద్యార్థుల హత్యపై విదేశాంగ శాఖ ఆందోళన

గత వారం కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్యకు గురైన ఘటనలపై.. కెనడా అధికారుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలు దురదృష్టకరమైనవని, బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. కెనడాలో ఇండియన్లపై దాడుల పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొన్నారు.