మాస్కో: భారత విదేశాంగ విధానం భేష్ అని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నిజమైన దేశభక్తుడని ఆయన మెచ్చుకున్నారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. లావ్రోవ్ ఇంకా మాట్లాడుతూ.. భారత్ ఏ నిర్ణయమైనా తమ అవసరాలను బట్టి తీసుకుంటుందన్నారు. ఏదైతే నమ్ముతామో ఆ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటామని జైశంకర్ తనతో చెప్పారని లావ్రోవ్ పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూడా నిర్ణయాలు ఉంటాయని జైశంకర్ తెలిపారన్నారు. ఇండియాలా డైనమిక్ నిర్ణయాలు తీసుకునే దేశాలు చాలా తక్కువేనన్నారు.
ఆహార భద్రత, రక్షణతోపాటు వ్యూహాత్మక రంగాల్లో పశ్చిమ దేశాలపై ఆధారపడలేమని సెర్గే లావ్రోవ్ అన్నారు. భారత్ లాంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు సిధ్ధంగా ఉన్నామని తెలిపారు. ఇండియాతో స్నేహం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మాకు చిరకాల మిత్ర దేశం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. మోడీ నినాదమైన మేకిన్ ఇండియాకు మేం మద్దతునిస్తున్నాం. డిఫెన్స్ రంగంలో భారత్ కు ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు మేం రెడీ' అని లావ్రోవ్ వివరించారు.