టెర్రరిజంతో ఏమీ సాధించలేం :పాకిస్తాన్కు జైశంకర్ హితవు

టెర్రరిజంతో ఏమీ సాధించలేం :పాకిస్తాన్కు జైశంకర్  హితవు
  • ఉగ్రవాదాన్ని వీడితేనే అభివృద్ధి
  • ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్​కు జైశంకర్  హితవు
  • ఆత్మ పరిశీలన చేసుకోండి
  • ఎస్​సీవో సదస్సులో పాక్ పేరు ప్రస్తావించకుండానే చురకలు

ఇస్లామాబాద్: సరిహద్దులో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఉంటే ఆ రెండు దేశాల మధ్య రిలేషన్స్, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలకు అవకాశం ఉండదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ మూడు దుష్టశక్తులు.. అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారతాయని స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువాళ్లు కూడా దూరం అవుతారని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశ ప్రధాని షెహబాజ్‌‌ షరీఫ్ ప్రభుత్వానికి జైశంకర్ చురకలు అంటించారు. ఇస్లామాబాద్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్​సీవో) సదస్సు బుధవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమిట్​లో ఇండియా తరఫున జైశంకర్ హాజరై మాట్లాడారు. 

‘‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే ఈ దుష్ట శక్తులను ఎదుర్కోవడంలో రాజీపడొద్దు. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు దృఢంగా ఉండాలి. వీటిని ప్రోత్సహించే ఏ దేశమైనా సరే దాని పక్కనున్న దేశాలతో సంబంధాలు కొనసాగించలేదు. ఈ మూడింటిని ధీటుగా ఎదుర్కోవడమే ఎస్​సీవో ప్రధాన లక్ష్యం కావాలి. నేటి పరిస్థితుల్లో వీటిపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని జైశంకర్ చెప్పారు.

ఏకపక్ష ఎజెండా ఉండొద్దు

పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా సహకారం ఉండాలని కేంద్రమంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గుర్తించాలన్నారు. ఇది నిజమైన భాగస్వామ్యంతో బలపడాలని, ఏకపక్ష ఎజెండాగా ఉండకూడదని తెలిపారు. ‘‘గ్లోబలైజేషన్, రీ బ్యాలెన్సింగ్ అనేవి ప్రస్తుత వాస్తవాలు. ఎస్​సీవోలోని భాగస్వామ్య దేశాలన్నీ వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. 

వాణిజ్యం, ట్రాన్స్​పోర్టేషన్ పైనే ఫోకస్ పెడితే.. ఎస్​సీవో పురోగతి సాధించదు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కోసం సుస్థిర జీవనశైలి ఎంతో ముఖ్యం. వీటికి అనుగుణంగానే ఇండియా ముందుకు వెళ్తున్నది’’ అని జైశంకర్ వివరించారు.

చైనా ప్రాజెక్ట్​కు మద్దతిచ్చేదిలేదన్న ఇండియా

ప్రపంచ దేశాలన్నీ కష్టాలు ఎదుర్కొంటున్నాయని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. కరోనా దెబ్బ నుంచి ఇప్పటికీ కొన్ని దేశాలు కోలుకోలేవని, అదేవిధంగా.. పెరుగుతున్న రుణ భారాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. వీటితో పాటు మరికొన్ని సవాళ్లు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని వివరించారు. ఎస్​సీవో సదస్సుకు అధ్యక్షత వహించిన పాకిస్తాన్​కు జైశంకర్ అభినందనలు తెలిపారు. కాగా, చైనా చేపడుతున్న ‘వన్ బెల్ట్.. వన్ రోడ్’ ప్రాజెక్ట్​కు మద్దతు ఇచ్చేందుకు ఇండియా మరోసారి నిరాకరించింది.

రాజకీయ కోణంలో  చూడొద్దు: పాక్ ప్రధాని

‘వన్ బెల్ట్.. వన్ రోడ్’ ప్రాజెక్టును సంకుచిత రాజకీయ కోణంలో చూడొద్దని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌‌ షరీఫ్ అన్నారు. ఎస్​సీవో సదస్సులో మాట్లాడుతూ.. ఇండియా పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. ‘‘చైనా చేపడుతున్న ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇలాంటివి మరింత విస్తరించాలి. పాకిస్తాన్ – చైనా ఎకనామిక్ కారిడార్ మరింత బలోపేతం అవుతుంది’’ అని షెహబాజ్ అన్నారు.