IND vs AUS: దమ్ముంటే కొట్టు.. ఆసీస్ ఆటగాడికి జైశ్వాల్ ఛాలెంజ్

IND vs AUS: దమ్ముంటే కొట్టు.. ఆసీస్ ఆటగాడికి జైశ్వాల్ ఛాలెంజ్

పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా  రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 90 పరుగులు చేసి అజేయంగా క్రీజ్ లో ఉన్నాడు. మూడో రోజు సెంచరీ చేయడం ఖాయం అని అభిమానులు, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. తన శైలికి భిన్నంగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంతో పరిణితి చెందిన ఆటగాడిలా నిదానంగా ఆడుతూ భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. 

ఈ మ్యాచ్ లో జైశ్వాల్ బ్యాటింగ్ తో పాటు తన చమత్కారంతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లపై తనదైన పంచ్ లతో వినోదాన్ని పంచాడు. మొదట స్టార్క్ పై సెటైర్ వేసి అతన్ని స్లెడ్జింగ్ చేసిన జైశ్వాల్.. ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్ లబుషేన్ తో ఓపెన్ ఛాలెంజ్ చేసి వావ్ అనిపించాడు. మిచెల్ మార్ష్ వేసిన 44 ఓవర్ చివరి ఐదో బంతిని జైశ్వాల్ డిఫెన్స్ చేశాడు. అక్కడే ఉన్న  బంతిని సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. 

ఇంతలో జైశ్వాల్ ను రాహుల్ వెనక్కి పంపించాడు. జైశ్వాల్ కు దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ వికెట్లను కొట్టడానికి ప్రయత్నించాడు. జైశ్వాల్ క్రీజ్ కు దగ్గరలో ఉండడం చూసి కావాలనే లబుషేన్ వికెట్ల వైపు బంతి చూపించి భయపెట్టాడు. ఇది గమనించిన జైశ్వాల్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. క్రీజ్ బయటే ఉండి వికెట్లను కొట్టు అని అతనికి సైగ చేశాడు. కాసేపు ఫన్నీగా సాగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. 212 పరుగుల లీడ్‌లో ఉంది. భారత ఓపెన‌ర్లు జైస్వాల్ (90 నాటౌట్), రాహుల్(62 నాటౌట్) ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఆసీస్ పేసర్లు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఈ జోడీని విడగొట్టలేకపోయారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.