Team India: జైస్వాల్‌పై బీసీసీఐ సీరియస్.. అడిలైడ్ హోటల్లో ఏం జరిగింది..?

Team India: జైస్వాల్‌పై బీసీసీఐ సీరియస్.. అడిలైడ్ హోటల్లో ఏం జరిగింది..?

ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించే పని చేశాడు. సీనియర్లు, తన సహచరులంతా నిర్ధేశించిన సమయానికి ఎయిర్‌పోర్టుకి వెళ్లే బస్సెక్కితే.. తాను మాత్రం ఓ అరగంట లేటుగా హోటల్ నుండి బయటకొచ్చాడు. అలా అని బస్సులోని ఇతర క్రికెటర్లు అతను వచ్చే దాకా ఆగలేదు. కాసేపు వేచి చూసి.. అతను లేకుండానే అక్కడి నుండి బయలు దేరారు. ఈ ఘటనపై అడిలైడ్ సెక్యూరిటీ విభాగం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. 

అసలేం జరిగిందంటే..?

బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా బుధవారం(డిసెంబర్ 11) నుంచి అడిలైడ్ నుండి గబ్బా చేరుకోవాలి. ఈ ప్రయాణమే భారత ఆటగాళ్ల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది.

నివేదికల ప్రకారం, అడిలైడ్ నుండి భారత ఆటగాళ్లు ప్రయాణించాల్సిన విమానం బుధవారం ఉదయం 10:05 గంటలకు షెడ్యూల్ చేయబడింది. అందుకోసం, టీమ్ బస్సు బుధవారం ఉదయం 8:30 గంటల కల్లా హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరేలా ప్లాన్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లు 8.20 కల్లా బస్సెక్కారు. అయితే యువ ఆటగాడు జైస్వాల్ మాత్రం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించ లేదు. తన ఆలస్యానికి గల కారణాన్ని ఇతరులకు చెప్పలేదు. 

ALSO READ | WI vs BAN: బంగ్లా క్రికెటర్ బలుపు.. బంతిని బ్యాటర్ మీదకు విసిరి అప్పీల్

అతని కోసం ఓ అరగంట పాటు వేచి చూసిన ఇతర సభ్యులు.. ఎంతకూ రాకపోయేసరికి జైస్వాల్ లేకుండానే వెళ్లిపోయారు. తీరా 8:50కి హోటల్ నుండి బయటకొచ్చిన జైశ్వాల్ భారత ఆటగాళ్లు వెళ్లాల్సిన బస్సు కనిపించకపోయేసరికి ఖంగు తిన్నాడు. హుటాహుటీన టీమ్ సెక్యూరిటీ అధికారితో కలిసి కారు ఎక్కి విమానాశ్రయం వైపు పరుగులు తీశాడు. ఈ ఘటనను అడిలైడ్ సెక్యూరిటీ విభాగం బీసీసీఐ దృష్టికి తేవడంతో వివాదం పెద్దదైంది. అతని ఆలస్యానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

చెరొక విజయం..

ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు చెరొక టెస్టులో విజయం సాధించాయి. పెర్త్ టెస్టులో టీమిండియా గెలుపు అందుకోగా.. అడిలైడ్ పోరులో ఆతిథ్య ఆసీస్ విజయాన్ని అందుకుంది. ఇక మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుండి 18 వరకు బ్రిస్బేన్‌ లోని గబ్బా వేదికగా జరగనుంది.