IND vs AUS: చరిత్రకు చేరువలో: సచిన్ 14 ఏళ్ళ రికార్డ్ పై జైశ్వాల్ గురి

IND vs AUS: చరిత్రకు చేరువలో: సచిన్ 14 ఏళ్ళ రికార్డ్ పై జైశ్వాల్ గురి

ప్రస్తుతం భారత టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే ఓపెనర్ జైశ్వాల్ అని చెప్పుకోవాలి. ఏడాది కాలంగా జైశ్వాల్ భారత టెస్ట్ జట్టులో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలో ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ లో సెంచరీ చేసి సత్తా చాటిన జైశ్వాల్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పై 5 టెస్టుల్లో ఏకంగా 712 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఇటీవలే ముగిసిన పెర్త్ టెస్టులోనూ ఈ యువ ఓపెనర్ 161 పరుగుల భారీ సెంచరీతో సత్తా చాటాడు.

సూపర్ ఫామ్ లో ఉన్న జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో మరో అరుదైన రికార్డ్ పై కన్నేశాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్ లో ఉన్న జైశ్వాల్.. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో 1280 పరుగులు చేశాడు. జో రూట్ తర్వాత ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ భారత ఓపెనర్ మరో 283 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్ లో ఒకే క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలుస్తాడు. ఈ రికార్డ్ ప్రస్తుతం సచిన్ పేరిట ఉంది.   

ALSO READ : SMAT: వచ్చాడు సిక్సర్లతో హోరెత్తించాడు: తొలి మ్యాచ్‌లోనే సూపర్ కింగ్స్ ఆటగాడు మెరుపులు

2010 సచిన్ టెస్ట్ క్యాలండర్ ఇయర్ లో సచిన్ 14 టెస్టుల్లో 1562 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ రికార్డ్ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్‌ పేరిట ఉంది. 2006 లో యూసఫ్ 11 టెస్టుల్లో 1788 పరుగులు చేసి క్యాలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆసీస్ తో మరో మూడు టెస్ట్ మ్యాచ్ లాడాల్సి ఉంది. జైశ్వాల్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ మూడు టెస్టుల్లో సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.