ఆత్మగౌరవం ఉన్నోళ్లు డబ్బులకు అమ్ముడు పోరు : జాజాల సురేందర్

లింగంపేట, వెలుగు : ఆత్మగౌరవం ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరని, డబ్బు సంచులతో ఎన్నికలకు వచ్చిన నాన్​లోకల్ ​లీడర్ల మాటలను నమ్మె పరిస్థి తి లేదని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజాల సురేందర్ పేర్కొన్నారు. గురువారం లింగంపల్లి శివారులోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులపై  నమ్మకం లేక వారితో ప్రమాణం చేయించడం సిగ్గుచేటని కాంగ్రెస్​అభ్యర్థి మదన్​మోహన్​రావును ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు.

ఎల్లారెడ్డిలో ధర్మానికి, అధర్మానికి ,నిజాయతీకి, డబ్బు సంచుల మధ్య  పోరాటం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఏకమై తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్​హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్​గౌడ్​ మాట్లాడుతూ  సురేందర్​ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.  

ALSO READ: లిక్కర్‌‌ దందా చేస్తున్న బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌: అశ్విని కుమార్‌‌ చౌబే

కాంగ్రెస్​ లీడర్ల మాటలు నమ్మి మోసపోతే గోస పడతామన్నారు. జిల్లాగ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్​ఎదురుగట్ల సంపత్​ గౌడ్ ​మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​తోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సీనియర్​ నేతలు వడ్ల భీమయ్య, శ్రీనివాస్​రెడ్డి, మున్యానాయక్​తో పాటు వందలాది మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సురేందర్ ​ఆధ్యర్యంలో బీఆర్ఎస్​లోచేరారు.