- సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలి
హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణనకు తక్షణమే ప్రశ్నావళిని రూపొందించి.. మార్గదర్శకాలు విడుదల చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కులగణన సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
గురువారం బీసీ సంఘాల నేతలతో కలిసి ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాశ్, సురేందర్ లతో శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వేను వేగవంతం చేయాలని, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లను 42 శాతం కు పెంచాలని ఆయన కోరారు. సమగ్ర కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మీడియా ద్వారా ప్రతి పల్లెకు, గూడానికి, బస్తీకి చేరుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.