కులగణనకు అడ్డుపడితే రాష్ట్రం అగ్నిగుండమే: జాజుల శ్రీనివాస్ గౌడ్

కులగణనకు అడ్డుపడితే రాష్ట్రం అగ్నిగుండమే: జాజుల శ్రీనివాస్ గౌడ్
  • 24 గంటల్లో కేసీఆర్ తన వైఖరి చెప్పాలి
  • బండి సంజయ్ ​వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్​ డిమాండ్ చేశారు. కులగణనపై వెటకారంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి చెప్పిన విధంగా కులగణనపై జీవో జారీచేసి మాట నిలబెట్టుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై ఇచ్చిన జీవో బీసీలకు ఇచ్చిన కానుకగా పేర్కొన్నారు. కులగణనకు ఎవరైనా.. అడ్డుపడినా.. అడ్డంకులు సృష్టించినా రాష్ట్రం అగ్నిగుండంలా మండుతుందని హెచ్చరించారు.

బీసీ బిడ్డలంతా కులగణన పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మన కార్యసాధనకు ఈ రెండు నెలలు ఎంతో ముఖ్యమన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ల సాధనకు అడ్డురావద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై జీవో జారీ చేస్తే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు. వచ్చే 24 గంటల్లోపు కులగణనపై వారి వైఖరి చెప్పాలన్నారు. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూలే అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాభిషేకం చేయాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

20 తేదీన అఖిల పక్ష సమావేశం జరుగుతుందని, 22న మేధావులు, కవులు, రచయితలతో నగరంలో సమాలోచన సదస్సు నిర్వహిస్తున్నట్టు జాజుల పేర్కొన్నారు. కుందారం గణేశ్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ నేతలు ఎస్.దుర్గయ్య గౌడ్, ఎన్.బాలరాజు గౌడ్​, ప్రొఫెసర్ ఎం.భాగయ్య, గూడూరు భాస్కర్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.