కులగణన గడువు పెంచాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

  • సంచార జాతుల వారికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: జాజుల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కులగణన 100 శాతం పూర్తి చేయడానికి ప్రభుత్వం మరో వారం గడువు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  కోరారు. అనివార్య కారణాల వల్ల సర్వేలో పాల్గొనని వారికి ప్రత్యేకించి స్థిరనివాసం లేని సంచార జాతులకు మరొకసారి అవకాశం కల్పించాలన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో సీఎస్ ఆఫీస్ ఓఎస్డీ విద్యాసాగర్, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం జాజుల మాట్లాడారు. 17 జిల్లాల్లో 100 శాతం  సర్వే పూర్తయిందని అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.

వలస పోయిన వారికి నేటి వరకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థిరనివాసం లేనటువంటి 56 సంచార జాతుల వారికి సర్వే జరగలేదన్నారు.  ఇంటికి స్టిక్కరింగ్ వేసిన వారికి మాత్రమే సర్వే నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్​లో అపార్ట్​మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో కొద్దిమంది సర్వే నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల కోసం మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని 100 శాతం కులగణన సర్వే జరిగేలా చర్యలు తీసుకోవాలని జాజుల విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి తదితరులు పాల్గొన్నారు .