- విస్మరిస్తే కేంద్రంపై తిరగబడ్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్
- ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీల డిమాండ్లపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్రం కనుక బీసీల హక్కులను కాలరాస్తే.. బీసీలు ఐక్యమై కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ లోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓబీసీ జాతీయ సెమినార్ జరిగింది.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రతిరోజు అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటూన్నారే తప్ప సుమారు 60 శాతం ఉన్న ప్రజల ఆకాంక్షలను గుర్తించడం లేదని మండిపడ్డారు. పార్లమెంటులో రెండు రోజులు చర్చ పెట్టి.. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట, జాతి జనగణలో బీసీ గణన, జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల పెంచాలన్నారు. లేదంటే దేశంలో సామాజిక న్యాయం అజెండాగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు.
సెమినార్ లో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు, గోవా అధ్యక్షుడు మధు నాయక్, ఢిల్లీ అధ్యక్షుడు ఆన్సర్ రాజ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కులగనణ దిగ్విజయంగా పూర్తి అవుతుందని.. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టాలని అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అలాగే అగ్రవర్ణాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తూ, బీసీలను మాత్రం పూర్తిగా విస్మరించడం కేంద్రానికి తగదన్నారు.