హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై నిర్ణయం తీసుకోవడం, కులగణనకు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను సమన్వయ శాఖగా నియమించటం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. బిహార్ లో అక్కడి సీఎం నితీశ్ కుమార్ అనుసరించినట్టుగా ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జాజుల బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా బీసీలకు 47 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుకు 60 రోజుల గడువు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీశ్ మాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తానని ప్రకటించడాన్ని స్వాగతించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజునే వర్గీకరణ అమలుపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారని, దీంతో ఎస్సీ సామాజిక వర్గంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యత అర్థమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సర్కారు నిర్ణయం పట్ల ఓయూ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ కూడా స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాదిగ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.