ముషీరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పు విస్మయానికి గురిచేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల నేతలు కుందారం గణేష్ చారి, కులకచర్ల శ్రీనివాస్, శేఖర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలోని జనాభా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న టైంలో బిహార్ కోర్టు తీర్పు బీసీ సమాజాన్ని విస్మయానికి గురిచేసిందన్నారు. ఈబీసీ రిజర్వేషన్లపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జడ్జిలు లేకపోవడంతోనే ఈ తరహా తీర్పులు వస్తున్నాయన్నారు.
సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకం
బిహార్లో బీసీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచడాన్ని తప్పుబడుతూ.. అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బిహార్హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం బీసీ భవన్ నుంచి ఆర్.కృష్ణయ్య లెటర్ రిలీజ్ చేశారు. '
జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే రిజర్వేషన్లు పెంచొచ్చని ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బిహార్సీఎం నితీశ్కుమార్ఎన్డీఏకి మద్దతును ఉపసంహరించుకోవాలని కోరారు.