కులగణన చేపట్టకపోతే దేశంలో అగ్గి రాజేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: కులగణన చేయకపోతే దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక న్యాయ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘మహనీయుల జాతర’ పేరుతో బీపీ మండల్‌‌106 జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సమాజంలో తల ఎత్తుకునేలా చేసిన ఘనత బీపీ మండల్‌‌కు దక్కుతుందన్నారు. 

బీసీ రిజర్వేషన్‌‌ పితామహుడు బీపీ మండల్‌‌ అని, నేడు బీసీలు పొందుతున్న 27శాతం రిజర్వేషన్​ఆయన పుణ్యమేనని కొనియాడారు. బీపీ మండల్​జమిందార్​కుటుంబానికి చెందినప్పటికీ విద్యార్థి దశ నుంచే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు. ఆయన జయంతిని, వర్థంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మండల్ స్ఫూర్తితోనే కులగణన సాధిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు  అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్, బీపీ మండల్ మనవడు తదితరులు పాల్గొన్నారు.