జులై 14 నుంచి 31 వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర : జాజుల శ్రీనివాస్​ గౌడ్

జులై 14 నుంచి 31 వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర : జాజుల శ్రీనివాస్​ గౌడ్

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ జులై 14 నుంచి 31వ తేదీ వరకు 'సమగ్ర కులగణన సాధన యాత్ర 'చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని స్పష్టమైన హామీతో బీసీ డిక్లరేషన్ చేసిందని చెప్పారు.

కామారెడ్డి సభలో ఈ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డి సభ నుంచే బీసీ సమగ్ర కులగణన సాధన యాత్ర ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 17 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర కరీంనగర్ లో ఈ నెల 31న ముగియనున్నట్టు వివరించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.