- లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిందే కేసీఆర్: జాజుల
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఒక వ్యక్తిని చంపి వారికి సంతాపం తెలుపుతున్నట్టు ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను అన్యాయంగా తగ్గించిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. మంగళవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఏమైందని ప్రశ్నించారు. పదేండ్లయినా ఈ లెక్కలు బయట పెట్టకుండా మోసం చేసి ఇప్పుడు కులగణనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత హడావుడి చేస్తున్నారన్నారు.