కులగణన సర్వేకు సహకరించాలి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​

కులగణన సర్వేకు సహకరించాలి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​

మెదక్​టౌన్, వెలుగు: తెలంగాణలో జరుగుతున్న కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ కోరారు. మంగళవారం మెదక్  టీఎన్జీవోస్​ భవన్​లో నిర్వహించిన రౌండ్ టేబుల్​ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే అన్ని ఎన్నికలకు ఈ సర్వే పునాది లాంటిదన్నారు. పిడికెడు మంది లేని అగ్రకులాల వాళ్లు రాజ్యధికారం చేస్తున్నారని, పార్టీలకతీతంగా బీసీలు పని చేస్తే  అధికారం వస్తుందన్నారు. బీసీల వాటా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కుల గణనతో బీసీ జనాభా, రిజర్వేషన్ వాటా తేలుతుందన్నారు. కుల గణన సర్వేను బీసీలు తేలికగా తీసుకోవద్దని.. బీసీల అభ్యున్నతి కోసం, రాజ్యాంగ హక్కుల కోసమైనా సర్వేకు సహకరించాలని కోరారు. 

ఎన్నో పోరాటాలు చేస్తే సర్వే జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​లో పీసీసీ ప్రెసిడెంట్​ హోదాలో సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. సర్వేలో 56వ కాలంలో ఉన్న కులం అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా బీసీ అని సమాధానం చెప్పాలని కోరారు. బీసీలు రాజ్యాధికారం దక్కించుకునేందుకు కుల గణన వజ్రాయుధం వంటిదన్నారు. అలంపూర్  నుంచి ఆదిలాబాద్ వరకు బీసీల అభివృద్ధి కోసం త్వరలో రథయాత్ర చేపడతామని తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ల ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం ముందుండి నడిపించింది బీసీలేనన్నారు. ప్రాణ త్యాగాలు బీసీలు చేస్తే, బోగభాగ్యాలు అగ్రకులాలు వారు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మెట్టు గంగారాం, మల్లికార్జున్ గౌడ్, చింతల నర్సింలు, రాంచందర్ గౌడ్, భీమరి శ్రీనివాస్, శ్రీకాంత్, గుండు మల్లేశం, చంద్రకళ, అశ్విని, బొద్దుల కృష్ణ, శంకర్ గౌడ్  పాల్గొన్నారు.