ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలదే విజయం : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలదే విజయం : జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులే  గెలవబోతున్నారని బీసీ సంక్షేమ  సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. బీసీ అభ్యర్థుల విజయంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు, టీచర్ యూనియన్లు, ఓటర్లను మభ్య పెట్టడానికి విచ్చలవిడిగా కోట్ల రూపాయాలు ఖర్చు చేశాయని అయినప్పటికీ మెజార్టీ ఓటర్లు ముఖ్యంగా టీచర్లు, గ్రాడ్యుయేట్స్ బీసీ అభ్యర్థులకు మద్దతు పలికారని చెప్పారు.

 ఈ మూడు నియోజకవర్గాల నుంచి పూల రవీందర్, ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్య  గెలుస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో టికెట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా అవమానించాయని, గెలుపు గుర్రాల పేరుతో అందరూ కుమ్మక్కై రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చి బీసీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తాము విస్తృతంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు పర్యటించి బీసీలను రాజకీయంగా చైతన్యం చేశామని విచ్చలవిడిగా మద్యం, డబ్బులు వెదజలినప్పటికీ బీసీ వాదం వైపు విద్యావంతులు నిలబడ్డారని జాజుల పేర్కొన్నారు.