మహిళ మృతికి సానుభూతి తెలపకుండా నటుడి అరెస్టును ఖండిస్తారా : జాజుల శ్రీనివాస్ గౌడ్

మహిళ మృతికి సానుభూతి తెలపకుండా నటుడి అరెస్టును ఖండిస్తారా : జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: నటుడిని అరెస్ట్ చేస్తే పెడబొబ్బలు పెట్టిన నేతలు, యాక్టర్లు.. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతికి సానుభూతి ఎందుకు తెలియజేయలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. దేశంలో  పేదవారికి ఒక చట్టం, ఉన్నోనికి ఇంకొక చట్టం ఉంటుందా అని నిలదీశారు.సినిమా నటులైనంత మాత్రాన చట్టాలకు, నిబంధనలకు అతీతులు కారనే విషయం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి తెలియదా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన నేతలను ఉద్దేశించి జాజుల శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

 మహిళ ఫ్యామిలీ పట్ల మానవత్వంతో వ్యవహరించని కొందరు నాయకులు సినిమా వాళ్ల సానుభూతి కోసం తెగ బాధపడుతుండటం హాస్యాస్పదమని మండిపడ్డారు. మోహన్ బాబు తాను సీనియర్ సిటిజన్ అని చెప్పుకుంటూనే జర్నలిస్ట్ ను గాయపరచడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా నటుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని తెలిపారు. 

సీఎం నిజాలే మాట్లాడారని ఆయన కామెంట్లను తాము సమర్ధిస్తున్నామని చెప్పారు. సినిమాలను సామాజిక బాధ్యతగా భావించి తీసేవారిని అభినందిస్తామని వెల్లడించారు. వ్యాపార కోణంలో సమాజాన్ని బ్రష్టు పట్టించేలా సినిమాలు తీసేవాళ్లను కఠినంగా శిక్షించాలని జాజుల డిమాండ్ చేశారు .