నిజ నిర్ధారణ కమిటీతో గురుకులాల తనిఖీ : జాజుల శ్రీనివాస్ గౌడ్​

ముషీరాబాద్, వెలుగు: త్వరలోనే  33 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్,  గురుకులాలను రిటైర్డ్ ​న్యాయమూర్తులు,  జడ్జీలు, మాజీ ఐఏఎస్ అధికారులు, మేధావులతో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ  సందర్శిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.   కలుషిత ఆహారం ఘటనలపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్​యాదవ్ అధ్యక్షతన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

 ఇందులో పాల్గొన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ర్యాంకులతో సంబంధం లేకుండా విద్యార్థులకు 100 శాతం ఫీజులు చెల్లించాలని, మెస్ చార్జీలు, ఫీజు రీయింబర్స్​మెంట్​విడుదల చేయాలని కోరారు. ఈ నెల మూడో వారంలో ఫీజులను విడుదల చేయాలని ఇందిరాపార్క్ వద్ద 48 గంటల ఫీజుల పోరు దీక్షకు దిగుతున్నామని తెలిపారు.  వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాటికొండ విక్రమ్ గౌడ్, కులకచర్ల శ్రీనివాస్, కిరణ్, అనిల్, పవన్, తదితరులు పాల్గొన్నారు.