బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఏనాడూ బీసీలకు టైం ఇయ్యలే : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఏనాడూ బీసీలకు టైం ఇయ్యలే : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • ‘బీసీపోరు గర్జన’ ధర్నా  చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కామెంట్​

న్యూఢిల్లీ, వెలుగు: ‘బీజేపీ కో హటావో– బీసీ రిజర్వేషన్స్​ బచావో’అనే నినాదంతో ఇకపై ఆందోళన చేపడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ వ్యతిరేక బీజేపీకి  బీసీలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. బీసీలను 11 ఏండ్లుగా ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక ఓబీసీ ప్రధాని అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. తెలంగాణ లో బీసీలకు రాజ్యాధికారం, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా పెద్ద మనసుతో కాంగ్రెస్ సర్కార్ బిల్లులను ఆమోదిస్తే.. వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ముందుకురావడం లేదని మండిపడ్డారు.

మతపరమైన రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. నిజంగా బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. మతంతో సంబంధం లేని బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాజుల శ్రీనివాస్​గౌడ్​ నేతృత్వంలో 12 బీసీ సంఘాలు ‘బీసీల పోరు గర్జన’ ధర్నాను నిర్వహించాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీలు ఈ ఆందోళనకు తరలివచ్చారు.  పోరుగర్జన సభలో జాజుల మాట్లాడుతూ.. బీసీలు చేస్తున్న ఈ ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం తెలపడంతో మిగతా రాష్ట్రాల్లో చర్చ మొదలైందని అన్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. 

కేసీఆర్​ కలిసేందుకే అవకాశమియ్యలే..

ఎప్పుడు బీసీ సమస్యలపై కలుద్దామన్నా కేసీఆర్​అవకాశం ఇవ్వలేదని జాజుల శ్రీనివాస్​గౌడ్​ గుర్తు చేశారు. కేసీఆర్ ను కొందరు పెద్ద సారు అని పిలుస్తారని, అయితే ఆయన పెద్ద సారో, పెగ్గు సారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కానీ, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సమస్యలు చెప్పుకునేందుకు బీసీలను కలిసే అవకాశం దక్కిందని చెప్పారు.  మోదీ మాత్రం ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడే బీసీ కార్డు వాడుకుంటున్నారని, ఆయన నిజమైన బీసీ కాదని అన్నారు.

 ఉల్లిపాయ, ఎల్లిపాయ లేకుండా శాకాహారం తినే ప్రధాని బీసీ ఎలా అవుతారని ప్రశ్నించారు.  ‘‘మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ అంటున్నది.  బీసీల్లో హిందువులు లేరా? సిక్కులకు రిజర్వేషన్స్ ఇస్తలేరా? అట్లాంటప్పుడు మైనార్టీల పేరుతో అడ్డుకోవడం భావ్యం కాదు’’ అని జాజుల అన్నారు. కులగణన చేస్తే సమగ్రత దెబ్బతిటదని బీజేపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.