![డెడికేటేడ్ కమిషన్‌తోనూ బీసీలకు న్యాయం జరగలేదు : జాజుల శ్రీనివాస్ గౌడ్](https://static.v6velugu.com/uploads/2025/02/jajula-srinivas-goud-spoke-media-that-justice-has-not-been-done-to-the-bcs-even-with-dedicated-commission_GQ49zkopCJ.jpg)
- గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లనే అమలు చేయాలనడం అవివేకం
- స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
హైదరాబాద్, వెలుగు: కులగణన రిపోర్టుతోపాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లోనూ బీసీలకు అన్యాయమే జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాజుల మీడియాతో మాట్లాడారు. బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు వచ్చేదాకా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని జీవోలో సర్కారు పేర్కొందని, ఆ జీవోనే బీసీలకు ఉరితాడైందన్నారు.
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతంలో ఎస్సీ, ఎస్టీ లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాక, మిగిలిన 22 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే అమలుచేయాలనడం అన్యాయమన్నారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వల్ల బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు పెరగకపోవడం దురదృష్టకరమని తెలిపారు.దీనిపై వచ్చే నెల 9న వేలాది మందితో బీసీ రణభేరి నిర్వహించి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని జాజుల తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన రిపోర్టును పునఃసమీక్షించి, కులగణన రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తో సంబంధం లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి చట్టం చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ పాల్గొన్నారు.