
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలన్న డిమాండ్ తో వచ్చే నెల 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరుగర్జన కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యేలా చూడాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మహేశ్ ను బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల బృందం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందించింది.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లు ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి వేల మందితో బీసీల పోరుగజన నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీ బిల్లు ఆమోదించే వరకు కేంద్రపై ఒత్తిడి తెస్తామని, రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నదని పీసీసీ చీఫ్ ప్రకటించారు.