IPL 2024: బ్యాడ్ లక్ అంటే ఢిల్లీదే.. గాయంతో మరో స్టార్ ప్లేయర్ ఔట్

IPL 2024: బ్యాడ్ లక్ అంటే ఢిల్లీదే.. గాయంతో మరో స్టార్ ప్లేయర్ ఔట్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఆ జట్టు ఇద్దరూ విదేశీ స్టార్ స్టార్ కోల్పోయింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వలన తప్పుకుంటే.. తాజాగా సౌతాఫ్రికా స్టార్ పేస్ బౌలర్ లుంగిసాని ఎన్‌గిడి గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సఫారీ బౌలర్ స్థానంలో ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ను ఎంపిక చేసింది. ముందుగా బ్రూక్ స్థానంలో మెక్‌గుర్క్‌ను సెలక్ట్ చేశారనే వార్తలు వచ్చినా అందులో నిజం లేదని ఢిల్లీ యాజమాన్యం తేల్చేసింది. ఈ ఆసీస్ చిచ్చర పిడుగుకి ఇదే తొలి ఐపీఎల్. అతడు కనీస ధర రూ. 50 లక్షల ధరకు క్యాపిటల్స్ జట్టులో చేరతాడు. బ్రూక్ స్థానంలో రీప్లేస్ మెంట్ ను ఇంకా ప్రకటించలేదు. 

మెక్‌గుర్క్ గత ఏడాది కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ చేసి చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ (అంత‌ర్జాతీయ వ‌న్డేలు, దేశ‌వాలీ వ‌న్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగ‌వంత‌మైన శ‌త‌కాన్ని న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజ‌ర్ 10 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి పరుగుల వరద పారించి.. ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు.       
 
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తమ తొలి మ్యాచ్ ను మార్చి 23 న పంజాబ్ కింగ్స్ తో తలబడుతుంది. గాయాలతో గతేడాది జట్టుకు దూరమైన రిషబ్ పంత్, నోకియా ఢిల్లీ జట్టులో చేరడం ఆ జట్టుకు పెద్ద ఊరట. వీరితో పాటు వార్నర్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ లతో కూడిన ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.