
బెల్లంపల్లి, వెలుగు: తనపై పలువురు కౌన్సిలర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్ లోని తన చాంబర్ లో ఆమె మాట్లాడారు. రెండు రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలో జరిగిన మొదటి కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కోసం చర్చించకుండా కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి బురదచల్లే ప్రయత్నం చేశారన్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన కౌన్సిలర్ ఆస్మా షేక్ భర్త యూసుఫ్ కోసం జమ చేసిన ఒక నెల కౌన్సిల్ సభ్యుల జీతం అప్పట్లో స్వాహా చేసిందని 20 మంది కౌన్సిల్ సభ్యులు తనపై అనవసరపు నిందలు వేశారన్నారు. తాను అలా చేసే చిల్లర మనిషిని కాదన్నారు. మరోసారి కౌన్సిలర్లు తనపై వ్యక్తిగత నిందలు మోపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.