దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్(జేజేఎం) విజయవంతంగా అమలవుతోంది. స్వతంత్ర భారత దేశంలో 70 ఏండ్ల కాలంలో 3.23 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తే.. జేజేఎం ఏర్పాటయ్యాక రెండేండ్ల కాలంలోనే కొత్తగా 4.92 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు వచ్చాయి. దేశసరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తాగునీటి ఇబ్బందులకు ఈ మిషన్ చెక్‌పెట్టింది. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా కేంద్రం ముందుకు సాగుతోంది.
జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా, మిజోరంలోని లాంగట్లాయ్, గుజరాత్‌లోని కచ్, నికోబార్‌దీవులు.. ఇవన్నీ దేశ నలుదిక్కుల్లో ఉన్న మారుమూల ప్రాంతాలు. అక్కడికి వెళ్లి ఎవరింట్లో గ్లాసెడు నీళ్లు అడిగినా.. వారు తమ ఇంట్లో కొత్తగా వేసిన నల్లా నుంచి ఆనందంగా నీళ్లు పట్టుకొచ్చి ఇస్తారు. సైనిక గస్తీ ప్రారంభమయ్యే ఈ సరిహద్దు జిల్లాలు నేడు దేశవ్యాప్తంగా ‘జల్‌జీవన్ మిషన్ (జేజేఎం)’ విజయానికి చిహ్నాలయ్యాయి. హిమాలయ పర్వత పాదాల వద్ద కనిపించే కుగ్రామాల నుంచి కేరళలోని అరటి తోటల దాకా ప్రజలు తాగునీటి కోసం కన్న కలలను ‘జేజేఎం’ నిజం చేస్తోంది. ప్రధాన మంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ- నిత్యం నీరందించే కొళాయి కనెక్షన్ లేని ఇల్లు అంటూ ఉండకూడదని, ఆ బృహత్తర కార్యం ‘జల్‌జీవన్ మిషన్’తోనే నెరవేరాలన్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మంచి నీటి’ని ‘మహదేవుడి (పరమేశ్వరుడు)’తో, ‘అమృత’ సమానమైనదిగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మాటలకనుగుణంగా ఆ ‘మహదేవుడి’ని ప్రతి ఇంటికీ చేర్చడం ‘జేజేఎం’ బృందానికి ఓ పవిత్ర కర్తవ్యంగా మారింది. రెండేండ్లుగా నిర్విరామ కృషి, కఠోర శ్రమతో పనిచేస్తే.. దేశంలో 8.12 కోట్ల నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి. - అంటే 42.46 శాతం ఇండ్లలో కొళాయిలు ఏర్పాటయ్యాయి. గడచిన 70 ఏండ్ల గణాంకాలు చూస్తే- 3.23 కోట్ల ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ‘జేజేఎం’ ఏర్పాటయ్యాక రెండేండ్లలోనే మరో 4.92 కోట్ల ఇండ్లకు కొళాయిలు వచ్చాయి. దేశంలోగల 78 జిల్లాల్లో 930 బ్లాకుల కింద ఉన్న 56,696 పంచాయతీల పరిధిలోని 1,13,005 గ్రామాల్లో వంద శాతం కుటుంబాలకు ఇప్పుడు నల్లా కనెక్షన్ ఉంది.
మహిళా సాధికారత..
జల్‌జీవన్ మిషన్ సాధించిన అద్భుత విజయాలపై చర్చల్లో తరచూ ప్రస్తావనకు రాని అంశం మహిళా సాధికారత కల్పనకు మిషన్ తోడ్పాటు. ఇందులో మొదటిది నీరు తెచ్చుకోవడం కోసం మహిళలు సుదూరం వెళ్లాల్సిన బాధలు తప్పాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు సాధికారత సాధిస్తున్నారు. గ్రామ, నీటి పారిశుధ్య కమిటీల్లో తమకు ఉన్న50 శాతం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామాల్లోని నీటి సరఫరా పథకాల సంబంధిత ప్రణాళికల రూపకల్పన, అమలు, యాజమాన్యం, నిర్వహణ తదితరాల్లో ప్రతిదాన్నీ ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలో నీటి నాణ్యత నిఘా కమిటీల్లో 5 మందికి పైగా మహిళలకే అవకాశం ఉండటం విశేషం. దీంతోపాటు అనేక మంది మహిళలు ప్లంబర్లు, మెకానిక్‌లు, పంపు ఆపరేటర్లు తదితర వృత్తుల్లోనూ నైపుణ్య సముపార్జన చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా ఇలాంటి కొత్త బాధ్యతల్లో మహిళలు చురుగ్గా పాలు పంచుకోవడం ఎంతో సంతోషించాల్సిన అంశం. మార్గదర్శక పాత్ర పోషిస్తున్న ఈ మహిళల ప్రభావం సున్నిత మనస్కులైన యువతులపై అపారంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వారి ఆదర్శంతో యువతులు చక్కగా ఎదుగుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. ‘మీమిటిక్స్’ అధ్యయనం ప్రకారం కొన్ని ఆలోచనలు సజీవపాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి ప్రతిపాదించిన ప్రతి ఇంటికీ కొళాయి ఆలోచన సాక్షాత్తూ ఒక సజీవ రూపుదాల్చింది. తదనుగుణంగా ప్రతి కొళాయిలో.. ప్రతి కమిటీలో ప్రతిఫలిస్తూ తనంతట తాను మహిళ సాధికారత సాధిస్తోంది. 2024 నాటికి ప్రతి ఇంటా కొళాయి కనెక్షన్ ఉండటం ద్వారా ‘జల్‌జీవన్ మిషన్’ అనే ఈ ఆలోచన కేవలం జల రంగాన్నే కాకుండా ఇతర అనుబంధ రంగాలను ప్రభావితం చేయనుంది.
డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు..
జేజేఎం100 శాతం జవాబుదారీగా అమలు జరుగుతోంది. ఈ మేరకు రోజువారీ కొత్త నల్లా కనెక్షన్ల వివరాలు డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్అవుతూనే ఉంటాయి. ఏ ప్రాంతంలో ఎన్ని నల్లా కనెక్షన్లు ఇచ్చారనే విషయాన్ని పోర్టల్‌లో చూడవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే జిల్లా, గ్రామం వివరాల్లోకి వెళ్లి లబ్ధిదారుల పేర్లను చూసుకోవచ్చు. ఆయా గ్రామాల్లో నిర్మించిన జల వనరులు, నీటి వినియోగదారు కమిటీల సభ్యులు, సాంకేతిక నిపుణులు వంటి వివరాలను కూడా ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు. ‘జేజేఎం’ నిర్వహించే ‘సెన్సర్ ఆధారిత నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ’ అంతర్జాతీయ స్థాయికి ఎంతమాత్రం తీసిపోదు. రోజూ పలు దఫాలుగా సరఫరా చేసే నీటిలో వివిధ ప్రమాణాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను బహిరంగ వేదికపై తనిఖీ చేసుకోవచ్చు. ప్రజలు ఏ నిమిషంలోనైనా తనిఖీ చేసుకునే వీలు కల్పించేందుకు జల్‌జీవన్ మిషన్ సదా సిద్ధంగా ఉంటుంది.
- గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి