వాన నీటిని ఒడిసి పడదాం

భారత రాష్ట్రపతి ‘జల్ శక్తి అభియాన్ – క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ 2022’ను ఇటీవలే ప్రారంభించారు. వర్షపు నీటిని సంరక్షించడానికి, భూగర్భ జలాలను పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది వరుసగా 3వ ఏడాది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో 2019లో జల శక్తి అభియాన్ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా వృథాను తగ్గించడంతోపాటు, వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భజలాలను కాపాడుకోవచ్చు. ప్రపంచ వనరులలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ వినియోగిస్తూ ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భజలాలను వినియోగిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్​ వరకు దేశమంతా అమలయ్యే జల శక్తి అభియాన్​క్యాచ్​ది రెయిన్​ క్యాంపెయిన్​లో అందరం పాల్గొని విజయవంతం చేద్దాం.

అనేక దశాబ్దాలుగా దేశ ఆహార భద్రతకు భరోసా ఇవ్వడంలో భూగర్భ జలాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ‘హరిత విప్లవం’ విజయాన్ని నిర్ధారించడంలో భూగర్భజలాలు ప్రధాన చోదక శక్తిగా పనిచేస్తున్నాయి. వీటితోనే ప్రస్తుతం 60 శాతానికి పైగా నీటిపారుదల వ్యవసాయం కొనసాగుతోంది. 85 శాతం గ్రామీణ ప్రజలకు తాగునీరు, 50 శాతం కంటే ఎక్కువ పట్టణాల అవసరాలు భూగర్భజలాలే తీరుస్తున్నాయి. అయితే భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రజలు జీవనోపాధి కోల్పోయి వలసలు వెళ్తున్నారు. అక్కడ కూడా సురక్షితమైన తాగునీరు దొరక్క ఆరోగ్య సమస్యల వంటివి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు మూడింట ఒక వంతులో భూగర్భ జల వనరులు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, సమాజంలో బలహీన వర్గాలు, భూగర్భ జలాల క్షీణతతో, కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి ప్రధాన మంత్రి స్ఫూర్తితో భారత ప్రభుత్వం 2019లో జల్ శక్తి అభియాన్ ను ప్రారంభించింది. నీటి సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమానికి  నాయకత్వం వహించాలని కోరుతూ స్వయంగా ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులందరికీ లేఖలు రాశారు. 2019లో జులై నుంచి నవంబర్​వరకు భూగర్భజలాలు దారుణంగా పడిపోయిన 256 జిల్లాల్లోని 1592 బ్లాక్స్​లలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాంతాల్లో రీచార్జ్​చేసే గ్రౌండ్​వాటర్​తో పోలిస్తే.. తోడేసే నీళ్లే పెద్ద మొత్తంలో ఉంటున్నట్లు తేలింది. అందుకే విస్తృత ప్రచారం, వివిధ కమ్యూనిటీల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం జలశక్తి అభియాన్​లక్ష్యంగా పెట్టుకుంది. 

ఐదు అంశాలపై దృష్టి

నీటి సంరక్షణ.. వర్షపు నీటి హార్వెస్టింగ్, సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, నీటి పునర్వినియోగం, వాటర్‌‌‌‌షెడ్ డెవలప్​మెంట్, అడవుల పెంపకం.. ఈ అయిదు ప్రధాన అంశాలపై జల శక్తి అభియాన్​ ప్రధానంగా దృష్టి పెట్టింది. -వీటితోపాటు వాటర్ కన్జర్వేషన్ ప్లాన్‌‌‌‌ల అభివృద్ధి, జిల్లా నీటి సంరక్షణ ప్రణాళికలు, కృషివిజ్ఞాన కేంద్ర మేళాలు, పట్టణ మురుగునీటి పునర్వినియోగం తదితర కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని 60 శాతం నిధులు గ్రామీణ నీటి సంరక్షణ కార్యక్రమాలకే వెచ్చిస్తోంది. వీటితోపాటు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, కంపా నిధులు, కార్పొరేట్​సోషల్​రెస్పిన్సిబులిటీ ఫండ్స్​కూడా నీటి సంరక్షణ కార్యకలాపాలకు వాడుతోంది. 2019లో సమష్టి కృషి ద్వారా 2.73 లక్షల వర్షపు నీటి హార్వెస్టింగ్​నిర్మాణాలు పూర్తయ్యాయి. 45 వేల జలవనరుల పునరుద్ధరణ జరిగింది. 1.43 లక్షల రీయూజ్​రీచార్జ్​ నిర్మాణాలు కంప్లీట్​అయ్యాయి. 1.59 లక్షల వాటర్ షెడ్ అభివృద్ధి సంబంధిత పనులు, 12.36 కోట్ల మొక్కల పెంపకం జరిగాయి. చాలా రాష్ట్రాలు మొదట అనుకున్నదానికంటే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కొన్ని రాష్ట్రాలు మొదట ఎంపిక చేసిన నీటి ఎద్దడి ఉన్న జిల్లాలతోపాటు మిగతా చోట్ల నీటి సంరక్షణపై అవగాహన కల్పించాయి. 2020లో కరోనా వల్ల కార్యక్రమానికి కొంత బ్రేక్​పడింది. అయితే 2019లో వచ్చిన స్పందనతో 2021లో జలశక్తి అభియాన్​పరిధి మరింత విస్తరించింది. ‘‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్” ప్రచారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లో  ప్రారంభమైంది. నిరుడు మార్చి నుంచి నవంబర్​30 వరకు కార్యక్రమం అమలు అయింది. ఇందులో భాగంగా దాదాపు 42 లక్షల నీటి సంరక్షణ సంబంధిత పనులు పూర్తయ్యాయి. 36 కోట్ల మొక్కలు నాటారు.14.76 లక్షల వర్షపునీటి హార్వెస్టింగ్​ నిర్మాణాలు పూర్తయ్యాయి.  2.78 లక్షల సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ జరిగింది. 7.34 లక్షల పునర్వినియోగం రీచార్జ్ నిర్మాణాలు కంప్లీట్​అయ్యాయి. 17.02 లక్షల వాటర్‌‌‌‌షెడ్ డెవలప్​మెంట్​పనులు జరిగాయి. ఈ పనులకు ఒక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కిందనే రూ.65 వేల కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. 

మార్చి నుంచి నవంబర్​ వరకు..

ఈ సంవత్సరం కూడా ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్’ దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ ప్రచారం మార్చి 22 నుంచి నవంబర్ 30 వరకు సాగుతుంది. నిరుటి లెక్క నీటి సంరక్షణ, భూగర్భజలాల ​రీచార్జ్​ కార్యకలాపాలు ఈసారి కూడా ఉంటాయి. అన్ని భవనాలపై రూఫ్-టాప్ రీయూజ్డ్​ వాటర్​ హార్వెస్ట్​ స్ట్రక్చర్స్​ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అన్ని కాంపౌండ్‌‌‌‌లలో ఇంకుడు గుంతలు, చెక్​డ్యామ్​ల డెవలప్​మెంట్, నిల్వ సామర్థ్యం పెంచేందుకు చెరువుల్లో పూడికతీత పనులు, చెరువు కాలువల నిర్మాణం, సంప్రదాయ మెట్ల బావుల పునరుద్ధరణ, ఇతర ఆర్‌‌‌‌డబ్ల్యుహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లకు మరమ్మతులు చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి జిల్లా పాత రెవెన్యూ రికార్డుల సాయం, ఎన్​ఆర్​ఎస్​ఏ నుంచి రిమోట్ సెన్సింగ్ చిత్రాలను, జీఐఎస్​మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం ఉన్న అన్ని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ గుర్తింపు, భవిష్యత్తు వాటర్​ హార్వెస్టింగ్​నిర్మాణాలకు శాస్త్రీయంగా ప్లాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నేషనల్​వాటర్​మిషన్ జీఐఎస్​ ఆధారిత నీటి సంరక్షణ ప్రణాళికలు, జిల్లాల నీటి వనరుల జాబితా తయారీకి మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దాని అమలు కోసం అన్ని జిల్లాలకు పంపింది. ఈ ఏడాది ఈ కసరత్తును పూర్తి చేసేందుకు అన్ని జిల్లాలను ప్రోత్సహిస్తాం.

జల శక్తి కేంద్రాల ఏర్పాటు

2021లో అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ‘జల శక్తి కేంద్రాలు’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ కేంద్రాలు నీటికి సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, జల సంరక్షణ, నీటి పొదుపు కోసం పనిచేస్తాయి. జల శక్తి కేంద్రాల ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం.. స్థానిక ప్రజలకు అలాగే జిల్లా పరిపాలనకు సాంకేతిక మార్గదర్శకత్వం అందించడమే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 336 జలశక్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ  ఏడాది ప్రతి జిల్లాలోనూ జల శక్తి కేంద్రం ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులతోపాటు నీటి సంరక్షణ, నిర్వహణ రంగంలో పౌర సమాజ సంస్థలు కూడా భాగస్వామ్యమై పనిచేస్తాయి. అన్ని రకాల నీటి వనరులను కాపాడుకోవడం, భూగర్భ జలాలను అవసరం మేరకే వాడటం, బహిరంగ మలవిసర్జన రహిత సమాజం సాధించడం, ప్రజలు జల సంరక్షణలో పాల్గొనడం వంటివి స్థిరమైన మార్పునకు పునాదిగా నిలుస్తాయి. జల్ శక్తి అభియాన్ విషయంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, వ్యక్తులు, సమూహాలు, నివాస సంక్షేమ సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, కార్పొరేట్లు, మీడియా సంస్థలు, విద్యా సంస్థలు అందరూ కలిసి జల శక్తి మిషన్​కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన రాబోయే తరాలకు మనం సురక్షితమైన నీటిని అందిద్దాం. జై హింద్.

:: గజేంద్ర సింగ్ ​షెకావత్, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి