
పహల్గాంలో అనాగరిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు గట్టి బుద్ది చెప్పేందుకు మొట్టమొదట ఆ దేశానికి సింధు జలాలు అందకుండా నిలిపివేసింది. పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చేసేందుకు భారత్ మూడు ప్రణాళికలు సిద్దం చేసింది. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు అమలు చేయనుంది.
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 1960 నాటి సింధుజలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 25) కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భవిష్యత్ కార్యచరణపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాకిస్తాన్ కు సింధు నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా పోనివ్వకుండా ప్రణాళికలు రెడీ చేసింది.
తమ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రకటించింది. ఒకవేళ పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకులు సంప్రదిస్తే.. భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దీర్ఘకాలిక ప్రణాళికలు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో ఆనకట్టల పూడికతీత, నది నీటిని ఎలా మళ్లించాలి, కొత్త ఆనకట్టల నిర్మాణం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేటప్పుడు భారత పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మరింత హామీ ఇచ్చిందని వర్గాలు తెలిపాయి.
మంగళవారం పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 టూరిస్టులు చనిపోయిన తర్వాత పాక్ తో దౌత్య సంబంధాలు తెంచుకున్న భారత్..వెనువెంటనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ లక్ష్యంగా ఇస్లామాబాద్ కేంద్రంగా పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్ అధికారికంగా గురువారం ప్రకటించింది. భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కొనసాగించే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తోందని.. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాక్ కు భారత్ లేఖ రాసింది.