మేడిగడ్డ బ్యారేజీ డిజైన్​ కరెక్ట్​ కాదు:కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన.. ఇకపై రాష్ట్రాల డిజైన్​ ఆఫీసులకు అక్రెడిటేషన్​ వ్యవస్థ

మేడిగడ్డ బ్యారేజీ  డిజైన్​ కరెక్ట్​ కాదు:కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన.. ఇకపై రాష్ట్రాల డిజైన్​ ఆఫీసులకు అక్రెడిటేషన్​ వ్యవస్థ
  • టెక్నికల్​ అడ్వైజరీ కమిటీ మీటింగ్​లో సీడబ్ల్యూసీకి ఆదేశాలు
  • సీతారామ సాగర్​ ప్రాజెక్టు విషయంలో మినహాయింపులు
  • ఫిబ్రవరి 11న జరిగిన మీటింగ్​ మినిట్స్​ విడుదల

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్​ కరెక్ట్​ కాదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అదో ఫెయిల్యూర్​ డిజైన్​ అని పేర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించి ఆయా రాష్ట్రాల డిజైన్​ ఆఫీసులు ఇచ్చే డిజైన్లను సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) నేరుగా ఆమోదించవద్దని సూచించింది. తొలుత అన్ని రాష్ట్రాల డిజైన్స్​ ఆఫీసులకు అక్రెడిటేషన్​ వ్యవస్థను ఏర్పాటు చేయాలని,  అక్రెడిటేషన్​ ఉన్న స్టేట్​ డిజైన్స్​ ఆఫీసులు ఇచ్చే డిజైన్​ సర్టిఫికెట్లకు మాత్రమే ఓకే చెప్పి, సంబంధిత ప్రాజెక్టుల డిజైన్లను ఆమోదించాలని ఆదేశించింది. 

ప్రస్తుతానికి సీతారామసాగర్​ ప్రాజెక్టు విషయంలో మినహాయింపులు ఇవ్వాలని, నెల రోజుల్లో మరోసారి ప్రాజెక్టు డిజైన్లపై రివ్యూ చేయాలని సీడబ్ల్యూసీకి సూచించింది. ఈ మేరకు  సీడబ్ల్యూసీకి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 11న జరిగిన 157వ టెక్నికల్​ అడ్వైజరీ కమిటీ మీటింగ్​లో ఆమె ఈ ఆర్డర్స్​ ఇచ్చారు. ఆ మీటింగ్​కు సంబంధించిన మినిట్స్​ను సోమవారం కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. మినిట్స్​లో సీతారామ లిఫ్ట్​ఇరిగేషన్​, సీతమ్మసాగర్​ మల్టీపర్పస్​ ప్రాజెక్టులపై చర్చించిన వివరాలనూ పొందుపరిచారు. 

నీటి లభ్యత ఉంది..

సీతారామ సాగర్​ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి లభ్యతపై అడ్వైజరీ కమిటీ మెంబర్​ సెక్రటరీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి లభ్యత ఉందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే హైడ్రలాజికల్​ స్టడీస్​ చేశారని, ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యత ఉందని టెక్నికల్​ అడ్వైజరీ కమిటీ మెంబర్​ సెక్రటరీ, సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్​ అప్రైజల్​ ఆర్గనైజేషన్​ సీఈ  యోగేశ్​ పైథాంకర్​ వివరించారు. 

నిబంధనలకు తగ్గట్టు సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే అప్రైజల్​ ఇచ్చిందని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్​ఎంబీ)కీ పంపించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి నాటికి ప్రాజెక్టు పనులు 56.8 శాతం మేర పూర్తయ్యాయని, 56.71 శాతం మేర నిధులూ ఖర్చు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు కోసం రూ.11,316 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అయితే, ప్రాజెక్టు ఇంకా పూర్తి కానందున ఇప్పటివరకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. 

భూసేకరణ, ప్రాజెక్టు ఖర్చులను తగ్గించేందుకు అండర్​ గ్రౌండ్​ పైప్​లైన్​ సిస్టమ్​ను పరిశీలించాల్సిందిగా అడ్వైజరీ కమిటీకి కేంద్రజలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు. కొత్త ప్రాజెక్టు కాబట్టి నీటి సరఫరాకు పైప్​లైన్​ సిస్టమ్​ వాడితే బాగుంటుందని చెప్పారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో పైప్​లైన్​ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలవుతుందా? అని ఆమె ప్రశ్నించారు. సూక్ష్మ సేద్యాన్ని దృష్టిలో పెట్టుకుని పైప్​లైన్​ డిస్ట్రిబ్యూషన్​ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటామని ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా పేర్కొన్నారు. 

సీతారామసాగర్​కు పర్యావరణ అనుమతుల్లేవు

సీతారామ సాగర్​ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని అడ్వైజరీ కమిటీకి  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జాయింట్​ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్ర సర్కారు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టును చేపట్టిందని, దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై నిషేధం విధించామని వివరించారు. అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి సంబంధించి రూ.54 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. 

అయితే, దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి.. వాస్తవానికి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అనేవి ఇన్వెస్ట్​మెంట్​ క్లియరెన్స్​ సమయంలోనే ఇస్తుంటారని, సీతారామసాగర్​ ప్రాజెక్ట్​కు సంబంధించి ఇప్పటికే ఉల్లంఘనలు జరిగినందున చేసేదేమీ లేదని, ఇప్పుడైనా పర్యావరణ అనుమతులు ఇచ్చే అంశంపై ఆలోచన చేయాలని సూచించారు. ప్రాజెక్టుకు అప్రైజల్​ ఇచ్చామని, జీఆర్​ఎంబీకి పంపించామని మెంబర్​ సెక్రటరీ స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నామని, అప్రైజల్​ పొందిన అన్ని ప్రాజెక్టులకూ నిబంధనల ప్రకారం అపెక్స్​ కౌన్సిల్​లో ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. 

సైట్​ ఇన్వెస్టిగేషన్​ చేశారా..?

సీతారామసాగర్​ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ముందు నిర్మాణ ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్స్​ చేశారా? అని రాష్ట్ర అధికారులను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ప్రశ్నించారు. అన్ని పరీక్షలూ చేశామని, ప్రాజెక్టు స్థలం రాయితో కూడిన ప్రదేశమని రాష్ట్ర అధికారులు వివరించారు. ప్రాజెక్టును ఇప్పటికే ప్రారంభించినందున ఇప్పుడు అప్రైజల్​ కమిటీ ముందుకు తీసుకురావాల్సిన అవసరమేమిటని అడ్వైజరీ కమిటీ అడిషనల్​ చీఫ్​ అడ్వైజర్​ ప్రశ్నించగా.. అనుమతులు పొందని ప్రాజెక్టులన్నింటికీ విభజన చట్టం ప్రకారం టెక్నికల్​ క్లియరెన్సులు ఇవ్వాల్సి ఉంటుందని మెంబర్​ సెక్రటరీ బదులిచ్చారు. 

వరద అధికంగా వచ్చినప్పుడు వరదనీటితోపాటు గ్రౌండ్​ వాటర్​ను కలిపి వాడుకోవడంపై సెంట్రల్​ గ్రౌండ్​ వాటర్​ బోర్డు (సీజీడబ్ల్యూబీ) వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సెంట్రల్​ సాయిల్​ అండ్​ మెటీరియల్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీఎస్​ఎంఆర్​ఎస్​) ఇచ్చిన డిజైన్​ అభ్యంతరాలపై నీతి ఆయోగ్​ డిప్యూటీ అడ్వైజర్​ ప్రశ్నించారు. 

వరద నీటితో కలిపి గ్రౌండ్​ వాటర్​ను కేవలం 0.3 టీఎంసీల మేర మాత్రమే వినియోగించుకుంటామని, ఈ వివరాలనూ ఇప్పటికే చెప్పామని రాష్ట్ర అధికారులు వివరించారు. సీఎస్​ఎంఆర్​ఎస్​ అభ్యంతరాలను అధికారులు కొట్టిపారేశారు. బ్యారేజీలో ఎక్కడా సీపేజీలు లేవని, పునాదుల్లోనూ సమస్యలు లేవని స్పష్టం చేశారు.