ఫోన్ ట్యాపింగ్​లో శ్రవణ్​దే కీలక పాత్ర

ఫోన్ ట్యాపింగ్​లో శ్రవణ్​దే కీలక పాత్ర
  •  పోలీసుల తరఫున హైకోర్టుకు వివరించిన పీపీ నాగేశ్వర్ రావు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ టీవీ చానెల్ ఎండీ శ్రవణ్ కుమారే కీలక పాత్ర పోషించాడని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు హైకోర్టుకు తెలిపారు. ఆయన్ను విచారించాల్సి ఉన్నదని, ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఓ మాజీ మంత్రి ఆదేశాలతోనే ఎస్ఐబీ ఆఫీసర్లతో కలిసి శ్రవణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడ్డారని వాదించారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్​ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​పై గురువారం హైకోర్టులో విచారణ ముగిసింది. 

ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి జస్టిస్ జి.రాధారాణి.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన లిస్ట్​ను ప్రణీత్ రావుకు శ్రవణ్ కుమారే ఇచ్చాడు. ఆ లిస్ట్​లో ప్రముఖ వ్యక్తులు, జడ్జీలు, రాజకీయ నేతల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేయగానే శ్రవణ్ కుమార్ అమెరికా పారిపోయాడు. అతనికి బెయిల్ ఇవ్వొద్దు’’అని పీపీ నాగేశ్వర్ రావు హైకోర్టుకు తెలిపారు. 

శ్రవణ్ కుమార్ తరఫున సీనియర్ అడ్వొకేట్ పప్పు నాగేశ్వర రావు వాదనలు వినిపించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కు మార్​కు ఎలాంటి సంబంధం లేదు. అతనిపై పోలీ సులు పెట్టిన సెక్షన్లు చెల్లవు. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిశారన్న ఆరోపణల ఆధారంగా శ్రవణ్ కుమార్​ను నిందితుడిగా చేర్చారు’’అని హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి జస్టిస్ రాధారాణి.. తీర్పును తర్వాత వెల్లడిస్తామన్నారు.