- క్షుద్రపూజల కోసం వచ్చే మహిళలపై అకృత్యాలు
- వీడియోలు చూపించి.. డబ్బులివ్వాలని బ్లాక్ మెయిలింగ్
ఫతెహాబాద్ (హర్యానా): హర్యానాలోని ఫతెహాబాద్ జిల్లాకు చెందిన 63 ఏళ్ల జిలేబీ బాబా అలియాస్ అమర్ పురికి స్థానిక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాదాపు 120 మంది మహిళలను రేప్ చేసి, ఆ వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడనే అభియోగాలు నిరూపితం కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ‘దయ్యాలు వదిలిస్తా.. తాంత్రిక విద్య తెలుసు’ అంటూ మహిళలను నమ్మించి.. తన వద్దకు వచ్చిన వారికి మత్తుమందు కలిపిన టీ తాగించి జిలేబీ బాబా చేసిన అఘాయిత్యాలు రుజువయ్యాయి. దీంతో అతడిని ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తూ ఫతెహాబాద్ జిల్లా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బల్వంత్ సింగ్ జనవరి 5న తీర్పు ఇచ్చారు. జిలేబీ బాబా బాధితుల్లో దాదాపు 120 మంది మహిళలతో పాటు ఒక మైనర్ కూడా ఉంది. ఆ చిన్నారిపై రెండుసార్లు అత్యాచారం జరిపినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఎవరీ జిలేబీ బాబా ?
జిలేబీ బాబా అసలు పేరు అమర్ వీర్. బిల్లూ రామ్ అని కూడా స్థానికులు పిలిచేవారు. అతడు 23 ఏళ్ల క్రితం పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని ఫతెహాబాద్ జిల్లా తొహానాకు కుటుంబంతో సహా వలస వచ్చాడు. అతడికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. తొహానాకు వచ్చాక దాదాపు 13 ఏళ్లపాటు అతడు జిలేబీలు తయారు చేసి అమ్మేవాడు. అందుకే బాబా అవతారమెత్తాక.. అతడికి ‘జిలేబీ’ బాబా అనే పేరొచ్చింది. జిలేబీల వ్యాపారం చేసే టైంలో ఒక తాంత్రికుడితో అమర్ వీర్ కు పరిచయం ఏర్పడిందని.. ఆ తాంత్రికుడి నుంచే క్షుద్ర పూజల గురించి నేర్చుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కొన్నేళ్ల పాటు అమర్ వీర్ ఊళ్లో కనిపించలేదని, మళ్లీ అకస్మాత్తుగా తిరిగి వచ్చేశాడని చెప్పారు. జిలేబీ బాబాగా అవతారమెత్తి, సొంతంగా ఒక బిల్డింగ్ కట్టుకొని.. అందులోనే ఒక మందిరాన్ని నిర్మించాడు. అక్కడికి వచ్చే స్థానికులకు చేరువై.. తనకు తాంత్రిక విద్య తెలుసని, క్షుద్రపూజలు చేస్తానని నమ్మిస్తూ మోసాలకు పాల్పడ్డాడు.
వ్యవహారం వెలుగుచూసిందిలా..
జిలేబీ బాబా వ్యవహారం తొలిసారిగా 2018 జులై 19న వెలుగు చూసింది. ఆ రోజున ఒక వ్యక్తి తొహానా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జిలేబీ బాబా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఒక వీడియో క్లిప్‌ను పోలీసులకు సమర్పించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే ఆ కేసులో అతడికి బెయిల్ లభించడంతో బయటికొచ్చాడు. అయితే సరిగ్గా ఏడాదిలోనే (2019 జులైలో) మరోసారి జిలేబీ బాబా లైంగిక వేధింపుల వీడియో క్లిప్ ఇంకొకటి వైరల్ గా మారింది. పోలీసులు జిలేబీ బాబా ఫోన్‌ను స్కాన్ చేయగా అందులో 120కిపైగా అటువంటి వీడియో క్లిప్స్ బయటపడ్డాయి. దీంతో వెంటనే బాబాను అరెస్టు చేశారు. నాటి నుంచి దాదాపు మూడున్నరేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. తాజాగా జనవరి 5న కోర్టు తీర్పు వచ్చింది.