ఇంద్రవెల్లి.. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఊరు పేరు మాత్రమే కాదు. గోండుల గుండెలపై చెరగని గాయం కూడా. దేశ మూలవాసులపై నాగరిక సమాజం చూపిన వివక్షకు, అణచివేతకు, హింసకు పర్యాయ పదం. ‘జలియన్ వాలాబాగ్’ (1919ఏప్రిల్ 13)ని తలపించిన వయొలెన్స్. ఉద్యమాల గిరి సీమగా, గోండుల ఖిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లో ఆ రోజుల్లో గోండులతోపాటు కోలాం, పర్థాన్ , నాయక్పోడు, తోటి, కోయలు నివసించేవారు. మహారాష్ట్ర బోర్డర్ కావటంతో మార్వాడీలు, లంబాడీలు, కోస్తా ప్రాంతం నుంచి కూడా ప్రజలు వలస వచ్చేవారు. భూఆక్రమణలు, అటవీ వనరుల దోపిడీ; వడ్డీ వ్యా పారుల, మార్కె ట్ వర్తకుల మోసాలకు నిరసనగా గిరిజన రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్ 20న మొదటి మహాసభను ఇంద్రవెల్లిలో ప్లా న్ వేసింది. కానీ దాన్ని పోలీసులు జరగనీయలేదు. దానికి కొద్ది రోజుల ముం దు కామ్రేడ్ హన్మంతరావు నాయకత్వంలో గిరి జన రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఒక ప్రదర్శన చేపట్టింది. ఏప్రిల్ 20న జరిగే ర్యాలీ, బహిరంగ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ నిర్మల్ టౌన్ నుంచి ఆదిలాబాద్ వరకు దారిపొడవునా పోస్టర్లు అంటించారు. గిరి జన గూడేల్లో తుడుం మోగించా రు. పోడు భూములకు పట్టాలు, పంటలకు గి ట్టుబాటు ధర ఇవ్వాలని; సంతలో అటవీ ఉత్పత్తుల కొనుగోలు సందర్భంగా తూనికల్లో చేసే తేడాలను అరికట్టాలనే డిమాండ్లు ఆ పోస్టర్లలో ఉన్నాయి.
ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20న ర్యాలీ, మీటింగ్తోపాటు ‘సోమవారం సంత’కి గిరి జనులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసులు భావించారు. బహిరంగ సభను విఫలం చేయటానికి ఒక రోజు ముందే 144 సె క్షన్ విధించారు. పరిసర ప్రాంతాలైన ఉట్నూరు, ముట్నూరు, పాటగూడ, పిట్ట బొంగారం, నర్సాపూర్, కేస్లాపూర్, తుమ్మగూడ గ్రామాల్లో సభకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయం తెలియని ఆదివాసులు ఏప్రిల్ 20న ఉదయం ఏడు గంటలకు అన్ని ప్రాంతాల నుంచి ఇంద్రవెల్లికి రావటం ప్రారంభించారు. కొందరు బస్సుల్లో , ఎడ్ల బండ్లలో; మరికొందరు కాలినడకన కొండలను, గుట్టలను, లోయలను దాటి ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ఊరుని చుట్టుముట్టిన పోలీసులు ఆదివాసులను లాఠీలతో కొట్టి తరిమేశారు. భాష్ప వాయువును ప్రయోగించి చెల్లాచెదురు చేశారు. హెచ్చరికలు లేకుండా ఉన్నట్టుండి కాల్పులు మొదలుపెట్టారు. కొందరు సాయుధ పోలీసు బలగాలు టాప్ లెస్ జీపుల్లో తిరుగుతూ, మరికొందరు చెట్లపై నుంచి గోండులను పిట్టల్లా కాల్చారు. పోలీసులు విచక్షణారహితంగా 423 రౌండ్లు కాల్పులు జరపటంతో దిక్కుతోచని జనం చెట్టుకొకరు– పుట్టకొకరుగా పరుగెత్తారు.
కొందరు అక్కడికక్కడే కుప్పకూలారు. ఆ ప్రాంతం గోండుల అరుపులతో, కేకలతో దద్దరిల్లింది. ఈ ఘోరం సామాన్య ప్రజల మనసులను తీవ్రంగా కలచివేసింది. చెల్లాచెదురైన డెడ్ బాడీలు ఇంద్రవెల్లి పరిసరాల్లో ఏప్రిల్ 26 వరకు కనిపించాయని గోండులు పౌర హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాల్పుల్లో 60 మంది అమాయకులు స్పాట్ లోనే చనిపోగా.. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాలన్నీ దినపత్రికల్లో అక్షరాలా ప్రింట్ అయ్యాయి. కానీ 13 మంది మా త్రమే మరణించారని, ఒక కానిస్టే బుల్ కూడా ప్రాణాలు కోల్పోయాడని సర్కారు అబద్ధాలాడింది. అనధికారికంగా ఇచ్చోడ టౌన్ లో పాతిక మంది, ముత్తనూర్ గ్రామంలో వైద్యం అందక 30 మంది, పోలీసుల పట్ల భయంతో వైద్యం కోసం వెళ్లలేక కొందరు, లోతట్టు ప్రాంతాల్లో కి తీసుకెళ్లడంతో మరికొందరి లెక్క తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. పోలీసులు ఆ రోజు అంగడికి వచ్చినవారిని కూడా అరెస్టు చేయటంతో జిల్లాలోని జైళ్లన్నీ గోండులతో కిక్కిరి సిపోయాయి. బడా కాంట్రాక్టర్లు, భూస్వా ములు, వడ్డీ వ్యా పారుల దోపిడీ ఆదివాసుల ఆర్థిక, సాం స్కృతిక జీవనాన్ని కకావికలం చేసింది.
మరపురాని ‘ఎరుపు’ అక్షరాలు
ఇంద్రవెల్లి ఘటన దేశంలోని ఆదివాసుల స్థితిగతులను చర్చకు తెచ్చింది. ప్రభుత్వాలు ఎన్నో సమీక్షలు జరిపి , కంటి తుడుపు చర్యలు చేపట్టాయే తప్ప వారి జీవితాల్లో ఆశించిన మార్పు తేలేకపోయాయి. క్షతగాత్రులు చాలా మంది ప్రభుత్వ ఆదరణ లేక మరణించారు. మిగిలినవారు కాలానికి ఎదురీదుతున్నారు. ‘కొండల్లు ఎరుపు.. గోగుపూలు ఎరుపు.. అడవిలో అమరుల త్యాగాలు ఎరుపు..’ ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపంపై చెక్కిన ఈ ‘ఎరుపు’ అక్షరాలు ఆదివాసీల, విప్లవకారుల ఉద్యమ పంథాను ప్రతిధ్వనిస్తూనే ఉంచుతాయి.
– శ్రీరుధిర