చెన్నై: సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడులో ఆ రాష్ట్ర సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' సందడి శనివారం నుంచి ప్రారంభమైంది. మొదటి జల్లికట్టు ఈవెంట్‌కు పుదుకోట్టై జిల్లా గందర్వకోట్టై తాలూకాలోని తచ్చన్‌కురిచి గ్రామం ఆతిథ్యమిచ్చింది. పోటీ కోసం పుదుక్కోట్టైతోపాటు తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, శివగంగై జిల్లాల నుంచి 600కు పైగా ఎద్దులను రంగంలోకి దించారు.
ఎద్దులను లొంగదీసుకునే ఈ ఆటలో పాల్గొనడానికి 350 మందికి పైగా యువకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం. అరుణ సమక్షంలో వారందరికి అధికారులు ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించి గుర్తింపు కార్డులను జారీ చేశారు. అనంతరం పోటీ ప్రారంభం కాగా.. తచ్చన్‌కురిచి గ్రామ యువకులు ఎద్దులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.
జల్లికట్టు అనేది సంక్రాంతి పండుగలో భాగంగా తమిళనాడులో జరుపుకునే ఎద్దులను లొంగదీసుకునే ఆట. క్రీడలో భాగంగా ఓ ఎద్దును ప్రజల గుంపులోకి వదులుతారు. యువకులు ఎద్దు మూపురం పట్టుకుని లొంగదీసుకుంటారు. ఎక్కువ మంది యువకులను పడేసిన ఎద్దుతోపాటు ఎక్కువ ఎద్దులను లొంగదీసుకున్న యువకులకు బహుమతులు అందజేస్తారు.