IPL 2025: 42 ఏళ్ళ వయసులో సాధ్యమేనా..? ఐపీఎల్‌పై కన్నేసిన ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్

IPL 2025: 42 ఏళ్ళ వయసులో సాధ్యమేనా..? ఐపీఎల్‌పై కన్నేసిన ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్

ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక పేసర్ చరిత్ర సృష్టించి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఆటకు వీడ్కోలు పలికిన వెంటనే టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మెంటార్‌ గా  బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా అండర్సన్ తనకు టీ20 క్రికెట్ ఆడాలని ఉందనే కోరికను బయట పెట్టాడు. ది హండ్రెడ్ 2024లో తాను ఆడాలనుకున్నట్లు తెలిపాడు. 

ఇంగ్లాండ్ లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ తో పాటు ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్ లు ఆడాలనుకున్నట్లు తెలిపాడు. అన్ని రకాల క్రికెట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఫిట్‌గా ఉండగలిగితే వచ్చే సీజన్‌లో హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఆడవచ్చని చెప్పాడు. “ది హండ్రెడ్ 2024లో బంతి స్వింగ్ అవడం నేను చూశాను. టోర్నమెంట్‌లో ఆటగాడిగా నేను ఆడాలని భావిస్తున్నాను. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు. వైట్-బాల్ క్రికెట్‌ ఆడేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాను". అని అండర్సన్ అన్నారు. 

అండర్సన్ టీ20లపై ఆసక్తి చూపించడంతో ఈ లెజెండరీ బౌలర్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే 42 ఏళ్ళ వయసులో ఈ పేసర్ ను ఫ్రాంచైజీలు పట్టించుకుంటారో లేదో చూడాలి. అతను చివరిసారిగా 2014 టీ20 బ్లాస్ట్ ఫైనల్ లో ఆడాడు. మొత్తం 44 టీ20 మ్యాచ్‌ల్లో 8.47 ఎకానమీతో 41 వికెట్లు పడగొట్టాడు.