ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ 21 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నేటి (జూలై 12)తో ముగిసింది. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు అండర్సన్ కెరీర్ లో చివరిది కావడం గమనార్హం. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అండర్సన్ తన ఫేర్ వెల్ టెస్ట్ ను విజయంతో ఘనంగా ముగించాడు. కొన్ని నెలల క్రితమే ఈ ఇంగ్లీష్ సీమర్ వెస్టిండీస్ తో జరగబోయే తొలి టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్ పై మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అండర్సన్ కు సహచరులు గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతం పలికారు. సొంతగడ్డపై వేలాది ప్రేక్షకుల మధ్య చప్పట్లతో అండర్సన్ వీడ్కోలు గ్రాండ్ గా జరిగాయి. తన చివరి టెస్టు లో ఈ ఫాస్ట్ బౌలర్ 4 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసుకున్న జిమ్మీ.. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 704 వికెట్లతో తన కెరీర్ ను ముగించాడు. ఇప్పటికే ఈ దిగ్గజ బౌలర్ వన్డే, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
2025-2026 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ సమయానికి అండర్సన్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. అండర్సన్‌కు వివరించినట్లు సమాచారం. ఈ కారణంగానే ఆండర్సన్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. 2002 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో అండర్సన్ తన ఫామ్ ను ఎప్పుడూ కోల్పోలేదు. మరోవైపు 41 ఏళ్ళ వయసులోనూ అదరగొడుతూ ఆటకు వయసు అడ్డం కాదని నిరూపించాడు. అండర్సన్ రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ దిగ్గజ పేసర్ ను ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మెంటార్ గా బాధ్యతలు అప్పగించింది.
TEARS AT LORD'S..!!!!!!
— Johns. (@CricCrazyJohns) July 12, 2024
- Farewell, James Anderson. 🐐 pic.twitter.com/XWx0DWLWFf