జిమ్మీనే గెలికాడు.. అతడే గెలిచాడు: గిల్‌తో గొడవపై స్పందించిన అండర్సన్

జిమ్మీనే గెలికాడు.. అతడే గెలిచాడు: గిల్‌తో గొడవపై స్పందించిన అండర్సన్

భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరిదైన ఐదో టెస్టులో స్లెడ్జింగ్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా యువ బ్యాటర్ శుభమాన్ గిల్, ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ మధ్య ఏదో మాటల యుద్ధం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. మ్యాచ్ అనంతరం గిల్ ని అడిగితే అది బయటకు చెప్పదలచుకోలేదు అని బదులిచ్చాడు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు అండర్సన్ పుల్ స్టాప్ పెట్టేశాడు. 

ఈ మ్యాచ్ లో సెంచరీతో గిల్ అదరగొట్టాడు. ఈ సిరీస్ లో రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ తర్వాత అండర్సన్ గిల్ దగ్గరకు వచ్చి నువ్వు ఇండియాలో కాకుండా బయట దేశాలపై పరుగులు చేశావా అని అడిగాడు. దీనికి గిల్ నువ్వు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందని నాతో అన్నాడు. ఆ తర్వాత రెండు బంతులకు నేను గిల్ వికెట్ తీశాను అని అండర్సన్ చెప్పుకొచ్చాడు. అండర్సన్..గిల్ విదేశాలలో విఫలమయ్యాడనే సంగతి గుర్తు చేశాడు.  
 
అండర్సన్ బౌలింగ్ లో గిల్ ఆడటంలో తరచూ విఫలమయ్యేవాడు. ఎంతో ప్రతిభ ఉన్న గిల్.. ఈ దిగ్గజ బౌలర్ ముందు నిలవలేకపోయాడు. తాజాగా జరిగిన టెస్టుల సిరీస్ లో సైతం గిల్ తొలి రెండు టెస్టుల్లో అండర్సన్ బౌలింగ్ కు తలవంచాడు. అయితే ఆ తర్వాత గిల్ అండర్సన్ మీద ఆధిపత్యం చూపించడం మొదలు పెట్టాడు. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో అండర్సన్ బౌలింగ్ ను అలవోకగా ఆడేశాడు. ముఖ్యంగా ముందుకు వచ్చి కొట్టిన స్ట్రయిట్ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో గిల్ 110 పరుగులు చేసి ఔట్ కాగా.. అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.