James Anderson: 700 వికెట్ల వీరుడు: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్

James Anderson: 700 వికెట్ల వీరుడు: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్

ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పై ఇటీవలే రిటైర్మెంట్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది నిజమా.. కాదా అని తెలుసుకొనేలోపు అండర్సన్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. శనివారం (మే 11) అంతర్జాతీయ క్రికెట్ కు  అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో అండర్సన్ చర్చలు జరిపిన తర్వాత ఈ ఇంగ్లీష్ పేసర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జూలై 10న లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు తన చివరి టెస్టు అని 41 ఏళ్ల ఈ దిగ్గజ బౌలర్ తెలిపాడు.  

"నేను ఇంగ్లండ్‌ జట్టు నుండి దూరమవ్వడం చాలా బాధ కలిగిస్తుంది. జట్టును చాలా మిస్ అవుతున్నాను. నేను క్రికెట్ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం అని నాకు తెలుసు. ఇతర క్రికెటర్లందరూ తమ కళలను సాకారం చేసుకోవాలి. ఇంత కంటే గొప్ప అనుభూతి నాకు ఏముంటుంది". అని అండర్సన్ ఒక ప్రకటనలో వెల్లడించాడు.  

ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో అండర్సన్ తన ఫామ్ ను ఎప్పుడూ కోల్పోలేదు. మరోవైపు 41 ఏళ్ళ వయసులోనూ అదరగొడుతూ ఆటకు వయసు అడ్డం కాదని నిరూపించాడు. కొన్ని నెలల క్రితం రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించే సరికీ మరికొన్నేళ్లు ఆడతాడని అందరూ భావించారు. అయితే అండర్సన్ తన రిటైర్మెంట్ ను ప్రకటించి షాక్ ఇచ్చాడు. 

2025-2026 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ సమయానికి అండర్సన్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. అండర్సన్‌కు వివరించినట్లు వార్తలు వచ్చాయి. 2022 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.