James Anderson: తప్పుకుంటున్నాడా.. తప్పిస్తున్నారా..! క్రికెట్‌కు ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్

James Anderson: తప్పుకుంటున్నాడా.. తప్పిస్తున్నారా..! క్రికెట్‌కు ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్

ఒక క్రికెటర్ రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ కెరీర్ ను కొనసాగించడం దాదాపు అసాధ్యం. సచిన్ లాంటి కొంతమంది దిగ్గజ ఆటగాళ్లకు  ఫీట్ సాధ్యమైనా.. ఫాస్ట్ బౌలర్ క్రికెట్ లో ఇప్పటివరకు 20 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడలేదు. పేస్ బౌలర్లకు తరచూ గాయాల కారణంగా క్రికెట్ కు త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ మాత్రం దీనికి మినహాయింపు. 22 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ జట్టుకు తన సేవలను అందిస్తూ ఇప్పటికీ సూపర్ ఫామ్ తో కుర్రాళ్లతో సమానంగా ఫిట్ గా ఉన్నాడు. 

ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో అండర్సన్ తన ఫామ్ ను ఎప్పుడూ కోల్పోలేదు. మరోవైపు 41 ఏళ్ళ వయసులోనూ అదరగొడుతూ ఆటకు వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నాడు. ఇటీవలే రిటైర్మెంట్ వస్తున్న వార్తలను ఖండించే సరికీ మరికొన్నేళ్లు ఆడతాడని అందరూ భావించారు. అయితే అండర్సన్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడని నివేదికలు తెలియజేస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అందులో శ్రీలంకతో జరిగే మొదటి టెస్టు అండర్సన్ సొంత నగరమైన ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌తో అండర్సన్ తన రెండు దశాబ్దాల క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

2025-2026 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ సమయానికి అండర్సన్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. అండర్సన్‌కు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జేమ్స్ అండర్సన్ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్టుగానే కనిపిస్తుంది. 2022 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.