న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించి ఓటింగ్ (డివిజన్)కి పట్టుపట్టడంతో స్పీకర్ అంగీకరించి ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 198 మంది ఎంపీలు ఓట్ చేశారు.
ALSO READ : వన్ నేషన్.. వన్ ఎలక్షన్: రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే.. మళ్లీ ఎన్నికలు.. కాకపోతే మిగతా కాలానికే..
కొత్త పార్లమెంట్ భవనంలో ఒక బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్దతిలో ఈ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 369 మంది సభ్యులు ఉండగా.. ఇందులో 269 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేయగా .. 198 మంది సభ్యులు వ్యతిరేకించారు. సభ్యులకు ఓటింగ్‌ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశాన్ని స్పీకర్ కల్పించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్దతిపై అనుమానాలు ఉంటే పేపర్ స్లిప్‌ల ద్వారా ఓట్ చేసే అవకాశం ఇచ్చారు. ఓటింగ్ అనంతరం సాధారణ మెజార్టీతో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి, జేపీపీకి పంపడానికి అనుమతి లభించింది. దీంతో జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు.