జమిలి ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్, వెలుగు: జమిలి ఎన్నికల నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్‌‌‌‌ మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికల బిల్లు దేశంలోని ఫెడరల్‌‌‌‌ వ్యవస్థలను బలహీనపరిచేలా ఉందన్నారు. ఆదానీ విదేశాల్లో రూ. 80 వేల కోట్లు లిస్ట్‌‌‌‌ చేసి వాటిని ఏపీ, గోవా, జమ్మూ కశ్మీర్‌‌‌‌ వంటి రాష్ట్రాలకు లంచం కింద ఇచ్చారని ఆరోపించారు. ఈ కుంభకోణం వెలుగుచూసిన వెంటనే అదానిపై కేసు నమోదు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోకుండా ఆయననే వెనకేసుకొస్తుందని విమర్శించారు. 

కాంగ్రెస్‌‌‌‌ సంవత్సర ప్రజా పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారు.. ఇంకా ఎన్ని అమలు కాలేదో ఆత్మ పరిశీలన చేసుకొని ఉత్సవాలు నిర్వహించాలని హితవు పలికారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి జిల్లాల పర్యటన టైంలో సీపీఎం లీడర్లను అరెస్ట్‌‌‌‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పోటీ చేసిన స్థానాలను మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌కే సపోర్ట్‌‌‌‌ చేశామని, అయినా తమ పార్టీ లీడర్లను అరెస్ట్ చేయడం బాధాకరం అన్నారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, నాయకులు వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, బొంతల చంద్రారెడ్డి, ఎండీ. జహంగీర్‌‌‌‌ పాల్గొన్నారు.