దేశానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు: కేంద్ర మంత్రి అమిత్ షా

దేశానికి జమిలి ఎన్నికలు కొత్త కాదు: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు కొత్త కాన్సెప్ట్ కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‎ను ఉద్దేశిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లను ఆయన ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ‘ఎజెండా ఆజ్ తక్’ ప్రోగ్రామ్‎లో ఆయన మాట్లాడారు. ‘‘ఫెడరలిజం సూత్రాలను జమిలి ఎన్నికలు దెబ్బతీస్తాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లను ఖండిస్తున్న. స్వాతంత్ర్యం వచ్చాక మూడు సార్లు జమిలి ఎన్నికలు జరిగినయ్. 1952లో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించారు. 

ఆ తర్వాత 1957లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏక కాలంలో ఎలక్షన్లు నిర్వహించేందుకు 8 రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసిన్రు. ఆ తర్వాత కూడా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‎ను అనుసరించారు. కేరళలోని సీపీఎం ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని నెహ్రూ విచ్ఛిన్నం చేసిన తర్వాత జమిలి ఎన్నికల విధానం మరుగున పడింది. 1971లో కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ లోక్‌‌సభను రద్దు చేశారు. అప్పటి నుంచి దేశంలో ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు’’ అని అమిత్ షా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు ఓడిపోతాయన్న ప్రతిపక్షాల విమర్శలపై అమిత్ షా మండిపడ్డారు.