లోక్​సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

లోక్​సభలో జమిలి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్​సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ(129వ సవరణ) బిల్లుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముందుగా వీటిపై దాదాపు 90 నిమిషాల పాటు వాడీవేడిగా చర్చ జరిగింది. తర్వాత బిల్లులను సభలో ప్రవేశపెట్టాలా..? వద్దా..? అనేది తేల్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు డివిజన్ ఓట్ చేపట్టారు.  తొలిసారిగా లోక్​సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కొందరు సభ్యులు, బ్యాలెట్ పద్ధతిలో మరికొందరు సభ్యులు ఓటేశారు. 

సభకు మొత్తం 467 మంది సభ్యులు హాజరుకాగా, బిల్లులకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా198 మంది ఓటేశారు. దీంతో బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024, యూటీల సవరణ బిల్లు, 2024 పార్లమెంట్ ఆమోదం పొందితే.. లోక్ సభతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల అసెంబ్లీలు, లోకల్ బాడీస్ ఎన్నికలను కూడా ఒకేసారి (లేదా ఒకే ఏడాదిలో) నిర్వహించేందుకు వీలు కానుంది. లోక్ సభ ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాలకు, యూటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉన్నందున కేంద్రం ఈ బిల్లులను ప్రవేశపెట్టింది.

 వ్యతిరేకించిన ప్రతిపక్షాలు 

జమిలి బిల్లులను ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన జమిలి బిల్లులు రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించే అధికారం పార్లమెంట్ కు కూడా లేదన్నారు. దేశంలో నియంతృత్వ పాలనను తెచ్చేందుకే అధికార బీజేపీ జమిలి బిల్లును ప్రవేశపెట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. 

Also Read:-తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని లోక్ సభ పదవీకాలానికి లింక్ చేసేందుకు జమిలి బిల్లులను తెచ్చారని, ఇవి ప్రజలు ఇచ్చిన తీర్పును తక్కువ చేయడమేనని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఐదేండ్ల కాలానికి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఓటర్ల హక్కు అని, జమిలి ఎన్నికలతో ఈ హక్కును హరించరాదని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అన్నారు. అయితే, జమిలి బిల్లులను ఉపసంహరించుకోని పక్షంలో వాటిని జేపీసీకి పంపాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, ఎన్ సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కోరారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయని ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 75 ఏండ్ల రాజ్యాంగ విజయోత్సవాల వేళ అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం జమిలి బిల్లును తెచ్చిందన్నారు.

జేపీసీకి పంపుతామన్న అమిత్ షా 

జమిలి బిల్లులతో రాష్ట్రాల హక్కులు, అధికారాలకు ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఎలాంటి మార్పులు జరగబోవని, ఇది కేవలం ఎన్నికల సంస్కరణలకు సంబంధించినది మాత్రమేనని అన్నారు. జమిలి బిల్లులపై సమగ్రంగా చర్చలు జరిపేందుకు వీలుగా జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ‘‘జేపీసీలో బిల్లులపై సమగ్రంగా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత జేపీసీ ఇచ్చే నివేదికను కేబినెట్ ఆమోదిస్తుంది. అనంతరం ఈ బిల్లులపై సభలో తిరిగి చర్చ జరుగుతుంది” అని ఆయన తెలిపారు. కాగా, జమిలి బిల్లులకు బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, శివసేన బేషరతుగా మద్దతు తెలిపాయి.

20 మంది బీజేపీ ఎంపీలకు పార్టీ నోటీసులు 

లోక్ సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం 20 మంది ఎంపీలు సభకు హాజరుకాలేదు. దీంతో ప్రభుత్వానికి మెజార్టీ లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్టయింది. దీంతో సభకు గైర్హాజరైన పార్టీ ఎంపీలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

31 మందితో జేపీసీ.. 90 రోజులు గడువు 

జమిలి బిల్లులపై అధ్యయనం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ వింటర్ సెషన్ ముగియనుండటంతో ఆలోపే జేపీసీని నియమించాలి. లేదంటే ఈ రెండు బిల్లులూ ల్యాప్స్ అవుతాయి. అలా అయితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ వీటిని తిరిగి సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక జేపీసీనీ ఏర్పాటు చేస్తే.. కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది చొప్పున గరిష్టంగా 31 మంది సభ్యులు ఉండనున్నారు. పార్టీలకున్న ఎంపీల సంఖ్యను బట్టి చూస్తే.. బీజేపీ నుంచే ఎక్కువ మంది సభ్యులకు చాన్స్ దక్కనుంది. అలాగే బీజేపీ సభ్యుడే కమిటీకి చైర్మన్ కానున్నారు. నివేదిక ఇచ్చేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఇవ్వనున్నారు.

2/3 మెజార్టీ ఏదీ?: కాంగ్రెస్ 

జమిలి బిల్లులు లోక్ సభలో పాస్ కావాలంటే కనీసం మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. మంగళవారం బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు నిర్వహించిన డివిజన్ ఓట్‎లో అధికార ఎన్డీయేకు 2/3 మెజార్టీ ఓట్లు రాకపోవడంపై కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఈ ఓటింగ్​తోనే ప్రభుత్వానికి మెజార్టీ లేదన్న విషయం తేలిపోయిందని స్పష్టం చేసింది. మంగళవారం సభకు 467 మంది సభ్యులు హాజరయ్యారు. వీరిలో 2/3 మెజార్టీ అంటే.. 307 ఓట్లు రావాలి. కానీ ప్రభుత్వానికి 269 ఓట్లే వచ్చాయి. అంటే.. జమిలి బిల్లుల ప్రతిపాదనకు మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడంలో సర్కారు ఫెయిల్ అయింది” అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్​ చేశారు.

పాస్ అయ్యేనా..? 

లోక్ సభలో ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 293 మంది ఎంపీలు ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో జమిలి బిల్లుల ఆమోదానికి ఓటింగ్ జరిగే సమయంలో సభకు హాజరైన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు అవసరం. లోక్ సభ ఫుల్ స్ట్రెంథ్‎తో సమావేశమైనట్టయితే.. ఎన్డీయే ఎంపీలంతా హాజరై ఓటేసినా బిల్లులను పాస్ చేసుకునేందుకు కావాల్సిన 2/3 మెజార్టీ ఓట్లు(362 ఓట్లు) రావు. అందుకే ఎన్డీయే కూటమిలో లేని ఇతర పార్టీల నుంచి కూడా మరో 69 ఓట్లు బీజేపీకి అవసరం అవుతుంది. వైసీపీ నుంచి నలుగురు, అకాలీదళ్ నుంచి ఒకరి మద్దతు లభించినా, కేంద్రానికి మరో 64 ఓట్లు అవసరమవుతాయి. మొత్తంగా బిల్లులు సభ ఆమోదానికి వచ్చిన సందర్భంలో జరిగే నెంబర్స్ గేమ్‎ను బట్టే బిల్లులు పాస్ అవుతాయా? లేదా? అన్నది తేలనుంది.