శమీ శమయతే పాపం ..శమీ శతృవినాశనీ
అర్జునస్య ధనుర్ ర్ధారీ.. రామస్య ప్రియదర్శిని ..
ఓ శమీ (జమ్మి) వృక్షమా... పాపాల్ని తొలగించేందు శత్రు భయం లేకుండా చేసేది నువ్వే అర్జునుడు ధనస్సు దాచింది నీ దగ్గరే... రాముడికి ప్రియం చేకూర్చిందీ నువ్వే. శ్రీరాముడు పూజించినట్లే నేనూ నిన్ను పూజిస్తున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా నా విజయయాత్రను సుఖమయం చెయ్యి.
దసరానాడు జమ్మి చెట్టుని పూజిస్తూ.... పైశ్లోకాన్ని రాసిన చీటీలు చెట్లకు తగిలించాలి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువ. ఆలయాల్లో ఏర్పాటు చేసిన కొమ్మలకి పూజలు చేసి జమ్మి ఆకుల్ని తెంచుకొని పంచుకుంటారు.
అన్నింటా జమ్మి
జమ్మి ఒక ముళ్ల చెట్టు. సాధారణంగా అడవుల్లో.. పొలాల గట్ల మీద పెరుగుతాయి. మెడిసినల్ గుణాలున్న చెట్టు ఇది. ఆయుర్వేదంలో చర్మ సంబంధ వ్యాధులకు ముందుగా జమ్మి ఆకులు బెరడుని వాడతారు. కానీ, ఈ చెట్టుతో ఆధ్మాత్మికత కూడా ముడిపడి ఉంది. దసరా వస్తే పవిత్రమైన చెట్టుగా పూజలందుకుంటుంది.
జమ్మి పవిత్రత గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మధనం చేపట్టినప్పుడు ... పాలకమండలి నుంచి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయి. వాటిలో శమీ (జమ్మి) చెట్టు కూడా ఉంది. యజ్ఞయాగాలు చేసే టైంలో రెండు కర్రలతో అగ్నిని వెలిగిస్తారు. అవి శమీ చెట్టు కర్రలే. దీన్ని అరణి అని పిలుస్తారు. వినాయకచవితి టైంలో చేసే వ్రతాల్లో జమ్మి ఆకుకి కూడా ప్రాధాన్యం ఉంటుంది.
ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యం పెరిగింది. వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. రావణుడితో యుద్దానికి ముందుకు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజిస్తాడు. తిరిగి అయోధ్యకు వెళ్లేటప్పుడు కూడా జమ్మిచెట్టుకు పూజలు చేశాడు. మహాభారతంలో అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ రాజ వస్త్రాల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి గాండీవాన్ని చేతబట్టిన అర్జునుడు... ఉత్తర కుమారుడికి అండగా నిల్చొని కౌరవసేనని తరిమికొట్టాడు.
బంగారం
అపరాజిత దేవి తనను పూజించిన వాళ్లకు విజయాల్ని అందిస్తుంది. శమీ వృక్షాన్ని అపరాజిత దేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇంత గొప్పదనం, పవిత్రత ఉండటం వల్లే పురాణకాలం నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయదశమి రోజున ఆనవాయితీగా వస్తోంది. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలయ్ బలయ్ చేసుకోవడం, పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే నార్త్ ఇండియాలో జమ్మి ఆకుని పంచుకొనే ఆచారం ఎక్కువుగా కనిపించదు.
ఆయుధపూజ
మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు సమక్షంలో ఆయుధాల్ని పూజించారనే ప్రచారం వల్ల... కొన్ని తరాలుగా ఆయుధపూజ ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే తర్వాతి రోజుల్లో ఆయుధపూజ తీరు మారింది. మెషిన్లకు, వాహనాలకు పూజలు చేసే కల్చర్ అలవాటు చేసుకున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు దుర్గాష్టమి లేదంటే విజయదశమి (దసరా)ని పేరెంట్స్ మంచిరోజని భావిస్తారు. స్టూడెంట్స్ కూడా తమ పుస్తకాలకు.. ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్లకు, ల్యాప్ టాప్ లకు పూజలు చేస్తున్నారు. వ్యాపారులు షాపుల్ని, మేనేజ్ మెంట్స్ కంపెనీలను పువ్వులతో డెకరేట్ చేసి దుర్గాదేవి పూజ చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తి పీఠాలను దర్శించుకోవడం చేయాలని పండితులు చెబుతున్నారు. కొత్త బండ్లకు పూజలు చేయడం సాధారణం కాని... దసరా రోజున సైకిల్ నుంచి ట్రాక్టర్ దాకా.. పోలీసుల గన్ ల దగ్గరి నుంచి విమానాల దాకా అన్నింటికి పూజలు చేస్తారు. వాహనాలకు పూజలు చేసేటప్పుడు గుమ్మడికాయను బలి ఇవ్వడం(దిష్టి తిప్పి నేలకు కొట్టడం) ఒక ఆనవాయితీగా వస్తోంది. అందుకే నిమ్మకాయ దండల్ని బండ్లకు వేస్తారు.