డాక్టర్ల ఆలస్యం..ఫ్యాన్లు లేక ఉక్కపోత.. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో గర్బిణీల అవస్థలు..

ప్రభుత్వాసుపత్రిని డెవలప్ చేస్తున్నాం..కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామంటూ ఓవైపు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుండగా..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం దారుణంగా ఉంది. కనీస సౌకర్యాలు లేక రోగులు, గర్బిణీలు అల్లాడిపోతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో కనీసం ఫ్యాన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. 

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి (CHC ) తెలంగాణ వైద్య విదాన్‌ పరిషత్‌ (TVVV)లోకి ప్రభుత్వం 2022లో మార్చింది. రూ. 5  కోట్లతో ఆసుపత్రిలో  అత్యాధునిక  సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా అక్కడ మినిమం సౌకర్యాలు లేవని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల కొరతతో రోగులు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఉక్కపోతతో గంటల తరబడి అవస్థలు పడుతున్నారు. 

జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి వైద్యులు తీరిగ్గా డ్యూటీలకు వస్తున్నారు. గైనకాలజిస్టులు ప్రతీ రోజూ ఆలస్యంగా వస్తుండటంతో... గర్భిణీలు గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో తమ ప్రాక్టీస్ చూసుకుని ప్రభుత్వాసుపత్రికి వస్తుండటం గమనార్హం.