ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై బల్దియాల ఫోకస్

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై బల్దియాల ఫోకస్
  • వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ ముందంజ 
  • కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వసూలైంది సగం పన్నులే

కరీంనగర్/గోదావరిఖని/ సిరిసిల్ల: మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై దృష్టి పెట్టారు. గపన్నులు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ లు చేపట్టారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 81 శాతం (రూ.3.16 కోట్లకుగాను రూ.2.56 కోట్లు) పన్ను వసూళ్లతో జమ్మికుంట మున్సిపాలిటీ ముందంజలో ఉండగా..  ఆ తర్వాత 77 శాతం(రూ.2.65 కోట్లకుగాను రూ.2.05 కోట్లు) వసూళ్లతో రెండో స్థానంలో హుజురాబాద్  నిలిచింది. 

ఆ తర్వాత సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ. 6.30 కోట్లకుగాను రూ.4.61 కోట్ల(73 శాతం)తో మూడో స్థానంలో ఉంది.  ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.50.16  కోట్లకు గాను రూ.25.96 కోట్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.16.17 కోట్లకుగాను 8.60 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.  జగిత్యాల జిల్లా కోరుట్ల రూ.5.05 కోట్లకుగాను రూ.3.60 కోట్లు(71శాతం), మెట్ పల్లిలో రూ.3.95 కోట్లకుగాను రూ.2.60 కోట్లు, రాయికల్ లో 1.32 కోట్లకుగాను 85 లక్షలు వసూలయ్యాయి. 

అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.4.29 కోట్లకుగాను 2.69 కోట్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలో రూ.5.40 కోట్లకుగాను రూ.3.29 కోట్లు, మంథనిలో రూ.1.74 కోట్లకుగాను 1.06 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీలో రూ.2.49 కోట్లకుగాను రూ.1.29 కోట్లు, జగిత్యాలలో రూ.13.41 కోట్లకుగాను రూ.6.06 కోట్లు, ధర్మపురిలో రూ.1.34 కోట్లకుగాను 60 లక్షలు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో రూ.2.82 కోట్లకుగాను 97 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. 

మిగిలింది 43 రోజులే.. 

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు ఇంకా 43 రోజులే మిగిలి ఉంది. దీంతో అధికారులు పూర్తిగా వసూళ్లపైనే దృష్టి సారించారు. ఇంకా మిగిలిన ట్యాక్స్​ వసూలు చేసేందుకు కార్పొరేషన్​ పరిధిలోని అన్ని డివిజన్లలో వెహికిల్స్​ను తిప్పుతూ  మైక్​ల ద్వారా యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టింది.రెవెన్యూ రికవరీ యాక్ట్​ కింద నోటీసులు...బల్దియాల్లో పెద్ద మొత్తంలో ట్యాక్స్​ చెల్లించాల్సిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయడానికి నిర్ణయించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ తరహాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు నెలల క్రితం తహసీల్దార్​ నోటీస్​లు జారీ చేశారు. 

నోటీసులు అందుకున్న వారు ట్యాక్స్​ చెల్లించకపోతే వారి ఆస్తులను జప్తు చేయడానికి సిద్దమయ్యారు. కాగా నోటీస్​లు అందుకున్న సింధూర ఇంజనీరింగ్​ కాలేజీ, సదానంద థియేటర్​, కవిత థియేటర్​, మరికొందరు రూ.48 లక్షల ట్యాక్స్​ను కార్పొరేషన్​కు చెల్లించారు. ఇంకా మరో ఆరుగురు సుమారు రూ.1.20 కోట్ల మేర ట్యాక్స్​ చెల్లించాల్సి ఉంది.  అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కరీంనగర్ డెయిరీకి రీఅసెస్ మెంట్ కోసం నోటీసులు ఇచ్చి ఆర్నెళ్లవుతున్నా ఇప్పటి వరకు రీఅసెస్ మెంట్ చేయలేదు. 

ఈ సారి వడ్డీ తగ్గింపు లేనట్టేనా...?

ప్రాపర్టీ ట్యాక్స్​ చెల్లించే వారికి బకాయిలు ఉంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ మీద రాయితీ కల్పించేంది. మార్చి వరకు ట్యాక్స్​ చెల్లించడానికి అవకాశం ఉండగా, ఫిబ్రవరి నెలలో బకాయి సొమ్ముపై వేసిన వడ్డీలో 90 శాతం తగ్గింపు ఉండేది. కానీ ఎంఎల్​సీ ఎన్నికల నేపథ్యంలో ఈ తగ్గింపు ఉంటుందా...? లేదా ...? అనే సంశయంగా మారింది.