
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని రైల్వే లైన్‌లో కొత్తపల్లి వైపు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక జనం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో మూడో లైన్ పనులు పూర్తికావడంతో ట్రాక్‌పై నుంచి నడవడం ఇబ్బందిగా మారింది. జమ్మికుంట మండలంలోని కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి సహా మిగతా గ్రామాలు, ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామాల ప్రజలు నిత్యం వివిధ పనుల కోసం ఈ లైన్ దాటే జమ్మికుంట వస్తుంటారు. గతంలో కొత్తపల్లి గ్రామం నుంచి రెండో ఫ్లాట్ ఫామ్ మీదుగా పట్టణంలోకి వచ్చేవారు.
ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణంతో గేటు కింది నుంచి వంగుతూ రావాల్సిన పరిస్థితి. వాహనాలపై రావాలంటే ప్రతిసారీ రూ.40 నుంచి రూ.50 ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొద్ది రోజుల కింద ఇలా ట్రాక్దాటుతూ రైలు ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. ఇప్పటికైనా ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని కొత్తపల్లి వాసులు ఇటీవల జమ్మికుంటకు వచ్చిన రైల్వే ఏడీఈ మనోజ్‌కుమార్ గుప్తాకు వినతిపత్రం అందజేశారు.