ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పిచ్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. గుజరాత్, వడోదరలోని రిలయన్స్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య బరోడా జట్టు పిచ్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని జమ్మూ & కాశ్మీర్ ఆరోపించింది. విజయం తప్పనిసరి కావడంతో బరోడా తమకు ఫలితం అనుకూలంగా వచ్చేందుకు రాత్రికి రాత్రే పిచ్ తారుమారు చేశారని J&K కోచ్ ఆరోపించారు. ఈ వ్యవహారంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే..?
రెండో రోజు ఆట ముగిసేసమయానికి జమ్మూ & కాశ్మీర్ 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ప్రారంభించడానికి ముందు జమ్మూ& కాశ్మీర్ కోచ్ అజయ్ శర్మ పిచ్‌ను పరిశీలించారు. అక్కడే ఆయనలో అనుమానాలు మొదలయ్యాయి. రెండోరోజు సాయంత్రం నల్లగా ఉన్న పిచ్.. తెల్లారే సరికి కాస్త రంగు మారినట్లు అనిపించింది. దాంతో, పిచ్ ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానించిన ఆయన.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, బ్యాటింగ్ కొనసాగించేందుకు నిరాకరించారు.
ALSO READ | Womens U19 T20 World Cup: మహిళల U-l9 ప్రపంచ కప్ విజేత ‘భారత్’
చివరకు ఆన్-ఫీల్డ్ అంపైర్లు పశ్చిమ్ పాఠక్, రవితేజ.. మ్యాచ్ రిఫరీ అర్జన్ కృపాల్ సింగ్ పిచ్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించి జమ్మూ & కాశ్మీర్ జట్టుకు సర్ది చెప్పారు. ఈ ఘటనతో గంటన్నర ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో బరోడాకు విజయం తప్పనిసరి. అదే J&K జట్టుకు అనుమానాలు రేకేత్తించింది.
శీతాకాలంలో పిచ్‌పై తేమ..
పిచ్ ట్యాంపరింగ్ జరిగినట్లు జమ్మూ కాశ్మీర్ చేసిన ఆరోపణలను బరోడా క్రికెట్ అసోసియేషన్(BCA) కొట్టి పారేసింది. J&K కోచ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తెలిపింది. శీతాకాలంలో పిచ్‌పై తేమ, అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటం సాధారణ విషయమని పేర్కొంది. సూర్య కిరణాలు తగలగానే ఔట్‌ఫీల్డ్ పొడిగా మారడం జరిగిందని.. అది అర్థం చేసుకొని J&K కోచ్ నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడించింది. కోచ్ అజయ్ శర్మ వ్యాఖ్యలపై BCCI ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, బరోడాపై జమ్మూ కాశ్మీర్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్ నిర్ధేశించిన 365 పరుగుల ఛేదనలో 182 పరుగులకే కుప్పకూలింది.