జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

 జమ్మూ కాశ్మీర్‎లో అసెంబ్లీ ఎన్నికల హాడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని పార్టీలు ఎలక్షన్ కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థుల ఎంపిక, క్యాంపెయినింగ్‎పై దృష్టి సారించాయి. మరీ ముఖ్యంగా.. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది బీజేపీ. అభ్యర్థుల ఎంపికపై సీరియస్‎గా కసరత్తు చేసి.. 44 మంది  క్యాండిడేట్లతో ఫస్ట్ లిస్ట్‎ను విడుదల చేసింది.

 జుమ్మూ కాశ్మీర్‎లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడతలో బీజేపీ 44 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన సీట్లకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యి అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం ఇవాళ జాబితాను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఆదివారం ఏడుగురు అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సైతం జమ్మూ కాశ్మీర్ లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీతో అలయెన్స్ పెట్టుకుంది. ఎన్సీ, కాంగ్రెస్ కలిసి ఈ సారి బరిలోకి దిగనున్నాయి. ఇక, 2018 నుండి జమ్మూ కాశ్మీర్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 

దేశ అంతర్గత భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్‎కు పత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, 35ఏ 2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. జమ్మూ కాశ్మీర్‎ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు విభజించి.. జమ్మూ, లద్దాక్‎ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా తొలగించిన అనంతరం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడింది. సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.