జమ్మూకాశ్మీర్ విభజన..వచ్చిన మార్పులు ఏంటి.?

జమ్మూకాశ్మీర్ విభజన..వచ్చిన మార్పులు ఏంటి.?

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి జమ్మూకాశ్మీర్ స్వదేశీ సంస్థానాధీశుడైన రాజా హరిసింగ్ పాలనలో ఉంది. దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, పాకిస్తాన్ గిరిజన మూకల దాడిని దృష్టిలో ఉంచుకుని 1947, అక్టోబర్ 26న కాశ్మీర్​ను భారతదేశంలో విలీనం చేస్తూ రాజా హరిసింగ్ విలీన పత్రంపై సంతకాలు చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి కాశ్మీర్ పార్ట్–బి రాష్ట్రాల జాబితాలో ఉండేది. 1956 రాష్ట్రాల పునర్​వ్యవస్థీకరణ చట్టం ద్వారా మన దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే కాశ్మీర్​ను రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూల్​లో చేర్చారు. 

  • ఒక వర్గం ప్రజలు కాశ్మీర్​ను పాకిస్తాన్​లో విలీనం చేయాలని, మెజారిటీ ప్రజలు భారత్​లోనే అంతర్భాగంగా ఉండాలని, భారత్​లో భాగంగా కాకుండా, పాకిస్తాన్​లో విలీనం చేయకుండా స్వతంత్ర కాశ్మీర్​గా ఉండాలని మరో  వర్గం వాదన. వ్యూహాత్మకంగా పరిశీలిస్తే కాశ్మీర్ సరిహద్దు సమస్య మాత్రమే కాదు అది మన దేశ రక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం.
  • దేశ విభజన కాలం నాటికి పరిస్థితులు, కాశ్మీర్ భారత్​లో విలీనం చెందినప్పుడు ఒప్పంద పత్రంలోని అంశాలను ఆధారం చేసుకుని మన రాజ్యాంగ నిర్మాతలు జమ్మూకాశ్మీర్​కు 370వ అధికరణ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ప్రాంతం వారికి రక్షణ ఉంటుందని మన రాజ్యాంగం కల్పించిన భరోసానే ఆర్టికల్ 370. 

జమ్మూకాశ్మీర్ విభజన చట్టం–2019

భారత పార్లమెంట్ ఆమోదించిన జమ్మూకాశ్మీర్ పునర్​వ్యవస్థీకరణ బిల్లుపై భారత రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్ 2019, ఆగస్టు 9న తన ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపొందింది. జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకాశ్మీర్ కు గల రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ కాశ్మీర్​ను విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక విధాన సభను కలిగి ఉన్న జమ్మూకాశ్మీర్​ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగానూ అదేవిధంగా శాసనసభ లేని లడఖ్​ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ముందుగా 370వ అధికరణ రద్దు చేశారు. అంటే 1954లో నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ జమ్మూకాశ్మీర్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జారీ చేసిన ఆర్డినెన్స్ తద్వారా కాశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది.

 37‌0వ అధికరణను రద్దు చేయడంతో కాశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది. అందువల్ల భారత రాజ్యాంగంలోని అంశాలు పూర్తిగా కాశ్మీర్​కు వర్తిస్తాయి. అలాగే, జమ్మూకాశ్మీర్ శాసనసభ ఆమోదం లేకుండానే భారత పార్లమెంట్ చేసే చట్టాలు పూర్తిగా కాశ్మీర్​కు వర్తిస్తాయి. అంటే రాజ్యాంగంలోని మూడో అధికరణ  ప్రకారం పార్లమెంట్ జమ్మూకాశ్మీర్ భూభాగాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. భూభాగాన్ని సవరించే విషయంలో కాశ్మీర్ శాసనసభ ఆమోదం అవసరం లేదు. లడఖ్​ తోపాటు లేహ్, కార్గిల్ జిల్లాలు లడఖ్​ కేంద్రపాలిత ప్రాంతంలో భాగస్వాములు అవుతాయి. 

పార్లమెంట్, శాసనసభ స్థానాలు

రాజ్యసభలో జమ్మూకాశ్మీర్​కు ఉన్న ప్రాతినిధ్యం నాలుగు స్థానాలు యథావిధిగా జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కొనసాగిస్తారు. నలుగురు రాజ్యసభ సభ్యులను జమ్మూకాశ్మీర్ శాసన సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. లోక్​సభలో జమ్మూకాశ్మీర్ గల ప్రాతినిధ్యం ఆరు స్థానాలు. వాటిలో లడఖ్​ ప్రాంతానికి ఒక స్థానం కేటాయించగా, మిగిలిన ఐదు స్థానాలు జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించారు. 

శాసనసభ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగంలోని 239–ఏ అధికరణ వర్తిస్తుందని పునర్​వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ ప్రత్యేక శాసనసభను కలిగి ఉంటుంది. శాసనసభ సభ్యుల సంఖ్య 111, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్​కు కేటాయించిన 24 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉంటాయి. మిగిలిన 87 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. శాసనసభ ద్వారా ఏర్పడే మంత్రిమండలి పరిపాలనలో లెఫ్టినెంట్ గవర్నర్​కు సలహాలిస్తూ శాసనసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళా ప్రాతినిధ్యం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ భావిస్తే శాసనసభలో ఇద్దరు మహిళలను నియమించవచ్చు. 

కాశ్మీర్ పరిధిలో వచ్చే జిల్లాలు 

జమ్మూ డివిజన్: దోడ, జమ్మూ, కథువ, కిస్ట్​వార్, పూంచ్, రజైరీ, రాంభన్, రీసి, సాంబ, ఉధంపూర్.
కాశ్మీర్ డివిజన్: అనంతరనాగ్, బందీపూర, బారాముల్లా, బుద్​గాం, గందేర్బల్, కుల్గాం, కుప్​వార, పుల్వామా, షోపియాన్, శ్రీనగర్.

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వల్ల సంభవించిన మార్పులు

జమ్మూకాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగి ఉండే అవకాశం లేదు. కాశ్మీర్ ప్రజలకు కల్పించే రాష్ట్ర పౌరసత్వం రద్దు అవుతుంది. అంటే భారత పౌరసత్వం మాత్రమే వర్తిస్తుంది. భారతీయులు ఎవరైనా కాశ్మీర్ లో భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. జమ్మూకాశ్మీర్​కు గల ప్రత్యేక పతాకం రద్దయింది. అంటే కేవలం జాతీయ జెండాను మాత్రమే ఎగరవేయాలి. సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి వర్తిస్తుంది. ఏ విధమైన అత్యవసర పరిస్థితి అయిననూ వర్తింపజేయవచ్చును. ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలపై కేంద్రమే సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంటుంది. శాసనసభ పదవీకాలం గతంలో మాదిరిగా ఆరు సంవత్సరాలు కాకుండా ఐదేండ్లుగానే ఉంటుంది.