
పహల్గాం మారణకాండ జరిగి వారం రోజులు కావస్తోంది.. ఈ ఘటన రేపిన ప్రకంపనల నుండి దేశం ఇంకా బయటపడలేదు. పాకిస్తాన్ పై ప్రతీకార చర్యతో దేశం రగిలిపోతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ట్రెక్కింగ్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. పర్యాటకుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. పారిస్తుతులు మెరుగుపడేంత వరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది ప్రభుత్వం.
జమ్మూ కాశ్మీర్ లో మే నెల నుంచి సెప్టెంబర్ వరకు పెద్ద ఎత్తున ట్రెక్కింగ్ లో పాల్గొంటారు పర్యాటకులు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న చాలా సాహసోపేత ట్రెక్కింగ్ స్పాట్స్ కి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొంతకాలం పాటు ట్రెక్కింగ్ స్పాట్స్ లో సందడి కొరవడనుంది.
జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెక్కింగ్ స్పాట్స్ మూసివేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. షార్ట్, లాంగ్ ట్రెక్కింగ్ స్పాట్స్ అన్నిటికి ఈ బ్యాన్ వర్తిస్తుందని తెలిపింది ప్రభుత్వం. అన్ని రూట్స్ లో ఈ బ్యాన్ అమలయ్యేలా జిల్లా పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం.
టూరిజంపై ప్రభావం:
పహల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ట్రెక్కింగ్ బ్యాన్ చేయడంతో మరింత ప్రభావం చ్చుపనుంది. ముఖ్యంగా ట్రెక్కింగ్ మీద ఆధారపడి వ్యాపారం చేసే స్థానికులు, లాడ్జిలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, ట్రెక్కింగ్ గైడ్స్ వంటి వారిపై తీవ్ర ప్రభావం ఉండనుంది.